అను`గ్రహం' బాగుంది
న్యూఢిల్లీ : లౌకిక రాజ్యంలో జోతిష్యుల లౌక్యానికే విలువెక్కువ. ఎన్నికలకు ముందు ఏ పార్టీ వారు ఆహ్వానిస్తే ఆ పార్టీకి, నాయకులకి రాజయోగం పట్టిందని సెలవిచ్చే ఈ పండితులు ఆ తరువాత రాజకీయ నాయకుల్లాగే పార్టీలను మార్చేస్తారు. ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీకి బాకా పట్టడంలో నాయకులకు కాకా కొట్టడంలో అద్భుతమైన ప్రజ్ఞా పాటవాలను ప్రదర్శిస్తూ వుంటారు. చిత్రంగా నాయకులుకూడా వీరిని అన్ని విధాలా గౌరవించి వారు చెప్పేవన్నీ నిజాలని నమ్మేసి నెత్తిన పెట్టుకుని పూజిస్తారు. ప్రగతిశీల ఐక్య కూటమి అధికార హస్తాన్ని అందుకున్న తర్వాత ఇలాంటి జ్యోతిష్యుల దశ తిరిగింది. ప్రజా బలంపై విశ్వాసం సన్నగిల్లి గ్రహబలంపై, దైవానుగ్రహంపై విశ్వాసం పెరగడం ప్రపంచ రాజకీయాల్లో ఒక విచిత్రమైన పరిణామం. యజ్ఞ-యాగాలు, పూజలు-పునస్కారాలు, శాంతులు-పుణ్యావచనాల్లాంటివి చేయని భారత రాజకీయ నాయకులు లేరంటే అతిశయోక్తి కాదేమో.
నామినేషన్ వేయాలన్నా, ప్రచారం ప్రారంభించాలన్నా, ఓటు వేయాలన్నా, ప్రమాణ స్వీకారం చేయాలన్నా... ఇలా ప్రతి రాజకీయ విషయంలోనూ మూఢ విశ్వాసాలు రాజ్యమేలుతున్నాయి. అదే కోవలో యూపీఏ సంకీర్ణ ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం 6-30 గంటలకు ప్రమాణ స్వీకారం చేసిన ఘడియలు అమోఘంగా వున్నాయని జ్యోతిష్కులు కితాబిచ్చారు. ఆ సయమంలో వృశ్చికం ఊర్ధ్వగమనంలో ఉండడంతో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్రభుత్వం అయిదేళ్ళపాటు స్థిరంగా అధికారంలో నిలుస్తుందని సిద్ధాంతులు జోస్యం చెప్పారు. రాక్షస గురువు శుక్రుడు ఊర్ధ్వ స్థానంలోవుండగా, రాజ్యాధిపతి అంగారకుడు అయిదోయింట్లో కొలువువుండడమనేది ఆధిపత్యానికి, వికాసానికి చాలా అద్భుతమైన సమ్మేళనమని వారు చెబుతున్నారు.
Pages: 1 -2- News Posted: 25 May, 2009
|