ఒక్క కాల్ కోసం నిరీక్షణ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీలో నింపాదిగా, ఆచితూచి నిర్ణయం తీసుకునే ప్రక్రియ పార్టీలో ఉన్నత స్థాయిలోను, మిత్ర పక్షాలలోను తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. తాము నిర్వహించవలసిన మంత్రిత్వశాఖలు తెలిసిన ఆరుగురు మినహా తక్కినవారు తమ భవిష్యత్తు ఏమిటో తెలుసుకుందామని ఎంతకూ రాని ఫోన్ కాల్ కోసం ఎదురుతెన్నులు చూస్తున్నారు.
తృణమూల్ కాంగ్రెస్ మరొక సహాయ మంత్రి పదవిని కోరినప్పటికీ మిత్రపక్షాలతో ఒప్పందానికి వచ్చినా కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగానే సమస్య తలెత్తింది. తగినంతగా ప్రాంతీయ ప్రాతినిధ్యం కోసం లోక్ సభ ఎంపిలలో వెంపర్లాట ఎక్కువగా ఉంది. ఇది నిర్ణయం తీసుకోవడాన్ని ఆలస్యం చేస్తున్నది. ఫలితంగా మంగళవారం నాటి ప్రమాణ స్వీకార కార్యక్రమంపై సందేహాలను లేవనెత్తుతున్నది. బుధవారం జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి అయినందున ఆ రోజూ ప్రమాణ స్వీకారం జరగకపోవచ్చు.
67 సంవత్సరాల కర్నాటక నాయకుడు, దళిత ప్రముఖుడు మల్లికార్జున ఖర్గె తనకు 'సముచిత రివార్డు' లభిస్తుందనే మాటపైనే తాను పోటీ చేసినట్లు చెబుతున్నారు. ఆయన రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడుగా తప్పుకున్నారు. కాని ఆ ఖాళీని ఇంతవరకు భర్తీ చేయలేదు. కేంద్రంలో ఆయన భవిష్యత్తు ఏమిటో ముందు తేలితే ఆ పదవిలో మరొకరిని నియమించడం కోసం రాష్ట్ర పార్టీ నాయకత్వం నిరీక్షిస్తున్నది. ఎస్.ఎం. కృష్ణ, వీరప్ప మొయిలీలకు మొదటి బృందంలోనే స్థానం కల్పించడంతో ఢిల్లీలో తన గతేమిటో ఇంకా అనిశ్చితంగా ఉన్నందున, తనకు ఫోన్ కాలేమీ రానందున బెంగళూరులోని పదవిని తాను వదలుకోవాలా వద్దా చెప్పవలసిందిగా ఖర్గె కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఒకరిని ఫోన్ లో అడిగారు.
ఇక ప్రతి మంత్రిత్వశాఖకు సంబంధించి సాగుతున్న ఊహాగానాలకు కపిల్ సిబల్, కమల్ నాథ్, వీరప్ప మొయిలీ ప్రధాన స్టార్లుగా ఉన్నారు. వారు రైజినా హిల్ దిగువన దాదాపు ముఖ్యమైన ప్రతి మంత్రిత్వశాఖనూ ఇప్పటికే నిర్వహించారు. మరింత ముఖ్యమైన శాఖ లభిస్తుందని ఆశిస్తున్న కమల్ నాథ్ కొంత మేరకు నిరాశ చెందారు. ఆయన ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీతో సుదీర్ఘ సమావేశాలు జరిపినట్లు తెలుస్తున్నది. కాని ఆయనకు కచ్చితమైన సమాధానం ఏదీ రాలేదు. వాస్తవానికి రక్షణ మంత్రి ఎవరనేది సస్పెన్స్ కొనసాగుతున్నప్పుడు రక్షణ మంత్రిత్వశాఖలో ఉన్నత స్థాయి అధికారులు ఎ.కె. ఆంటోనీ, కమల్ నాథ్ ఇద్దరి జీవిత వివరాలను సిద్ధం చేసుకున్నారు.
ఆ ముగ్గురికీ లభించవచ్చుననే ఊహాగానాలు సాగుతున్న మంత్రిత్వశాఖలలో న్యాయ, వాణిజ్య, రోడ్లు, నౌకాయాన, రవాణా, మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్ డి), చివరకు పర్యావరణం, అటవీ శాఖలు ఉన్నాయి. కమల్ నాథ్ కు ఎంతగా నచ్చజెపుతున్నప్పటికీ తన పూర్వపు శాఖను తిరిగి చేపట్టడానికి ఆయన అంత ఆసక్తి కనబరచడం లేదు. కపిల్ సిబల్ అయితే తాను న్యాయ శాఖను స్వీకరించేది లేదని తెగేసి చెప్పారు. వీరప్ప మొయిలీ అటువంటి ప్రాధాన్యతలేవీ లేవు. కాని ఏ సంగతీ తేల్చకుండా ఉండడం మాత్రం ఆయనకు ఇష్టంగా లేదు. 'నా మంత్రిత్వశాఖ ఏమిటో తెలుసుకోవాలనే తపన నాకు మీ కంటే ఎక్కువగా ఉంది. కాని ఫోన్ కాల్ రావడం లేదే' అని ఆయన చెప్పారు.
Pages: 1 -2- News Posted: 26 May, 2009
|