పేర్లపై సింగ్, సోనియా రాజీ!
న్యూఢిల్లీ : రెండు రోజుల పాటు తీవ్ర స్థాయిలో సంప్రదింపులు సాగించినా వాటిని ముగింపు దశకు తీసుకురాని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) చైర్ పర్సన్ సోనియా గాంధి మంత్రివర్గ విస్తరణపై ప్రతిష్టంభన పరిష్కారానికి తమకు తాము ఒక గడువు విధించుకున్నారు. రెండవ విడత మంత్రుల ప్రమాణ స్వీకారం గురువారం ఉదయం 11.30 గంటలకు జరుగుతుంది. ఇది విస్తృత ప్రక్రియ కాగలదని భావిస్తున్నారు. 55 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వారితో కలిపి రెండవ దఫా యుపిఎ మంత్రివర్గ సభ్యుల సంఖ్య 75కు చేరుకుంటుంది.
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సమయంపై అనధికారికంగా ప్రకటన వెలువడడాన్ని బట్టి అగ్ర నాయకులు ఇద్దరూ పేర్లపై ఒక అంగీకారానికి వస్తున్నట్లు కనిపిస్తున్నది. కాని ఈ ఆలస్యం కాంగ్రెస్ వాదులలో కడుపుమంటకు కారణం అవుతున్నది. సీనియర్ నాయకులు మూడు కారణాలపై అసంతృప్తి వెలిబుచ్చుతున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తరువాత నాలుగు రోజుల పాటు చాలా మంది మంత్రులు శాఖలు లేకుండా ఖాళీగా కూర్చోవడం ఒక కారణం కాగా, మిత్ర పక్షాల పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తూ వాటికి కోరుకున్న శాఖలను ఇవ్వబోవడం రెండవ కారణం. ఎన్నికైన సీనియర్ ఎంపిలు మంత్రి పదవుల కోసం ఇంకా నిరీక్షిస్తుండగా రాజ్యసభ సభ్యులు కొందరికి క్యాబినెట్ మంత్రులుగా పదోన్నతులు ఇవ్వడం మూడవ కారణం.
ఈ జాప్యానికి అసలు కారణాలు మన్మోహన్ సింగ్ కు, సోనియాకు, ఆమె రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ కు, చర్చలలో పాల్గొంటున్న రక్షణ శాఖ మంత్రి ఎ.కె. ఆంటోనీకి మాత్రమే తెలుసు. అయితే, పాలనకు సంబంధించిన డిమాండ్లకు, పార్టీకి ఎదురవుతున్న ఒత్తిళ్ళకు మధ్య సమతూకం తీసుకురావడానికి వారు తంటాలు పడుతున్నారని ఊహాగానాలు సాగుతున్నాయి.
కళంక రహితులను, సమర్థులను మాత్రమే చేర్చుకోవాలని మన్మోహన్ సింగ్ పట్టుబట్టుతున్నారు. అయితే, 'మా రాజకీయ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవడం, ప్రాంతీయ, సామాజిక సమతూకాన్ని పాటించడం మాకు అవసరం' అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. అసలు మంత్రుల మొదటి జాబితా కూర్పు చాలా మంది నాయకులకు మింగుడు పడలేదు. ఇది మన్మోహన్ సింగ్ ఎ-జట్టు అనే భావన చాలా మందికి కలిగింది. 'పార్టీలో కొందరు ఇతరుల కన్నాగొప్పవారనే భావన మొదటిసారిగా మాకు కలిగింది' అని మంత్రి పదవిని ఆశిస్తున్న సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు.
క్యాబినెట్ మంత్రులకు వారి శాఖల గురించి అయోమయంలో ఎందుకు ఉంచుతున్నారనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అయితే, ఇలా అడుగుతున్నవారు బయటపడడం లేదు. 'మా సహచరులు కొందరికి శాఖలను కేటాయించగా మిగిలినవారం తాము నిర్వహించబోయే శాఖ ఏమిటో తెలియకుండా ఇంటిలోనే కూర్చుండడం విడ్డూరంగా ఉంది' అని ఒక మంత్రి వ్యాఖ్యానించారు.
Pages: 1 -2- News Posted: 27 May, 2009
|