తెరాసలో ఆరని చిచ్చు
హైదరాబాద్ : రగిలిన చిచ్చు ఇంకా సెగలు కక్కుతూనే వుంది. అడవిలో అంటుకున్న నిప్పులా ఆరకుండా అన్ని వైపులా వ్యాపిస్తూనే వుంది. ఎన్నికలకు ముందు పొత్తుల పేరుతో కెసీఆర్ సాగించిన సుదీర్ఘ నాటకీయ ఎత్తుగడలు, మహాకూటమిలో చేరిన తర్వాత సీట్ల సర్దుబాటు పేరుతో చేసిన అనూహ్య ఫీట్లు, పోలింగ్ కాగానే ఫలితాలు రాకుండానే ఎన్డీఏ పొత్తు అంటూ చేసిన రాద్దాంతం ఇవన్నీ ఇప్పుడు తెరాసా మనుగడకు శాపాలుగా పరిణమించాయి. తెరాస అధినేతగా కెసిఆర్ ఒంటెత్తు పోకడలకు పోవడం వలనే తీవ్ర నష్టం జరిగిందని ఒక వర్గం, కెసిఆర్ ఏం చేసినా తెలంగాణ కోసమే చేశారని వాదనతో మరో వర్గం ఇప్పుడు కీచులాటలకు దిగాయి. పార్టీ నిలువునా చీలిపోవడానికి మార్గాలు ఏర్పడ్డాయి.
ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితిలో చెలరేగిన అసంతృప్తి సెగలు మరింత ఉధృతమయ్యే పరిస్థితులు కానవస్తున్నాయి. ఈ అసమ్మతిని ఎదుర్కొనేందుకు తెరాస తీవ్రంగా ప్రయత్నిస్తోంది. శాసనమండలిలో తెరాస పక్ష నాయకుడు కపిలవాయి దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో ఈ నెల 31న హైదరాబాద్ లో తెలంగాణ విమోచన వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తెరాసలోని అసంతృప్తి వాదులను, తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి పనిచేస్తున్న పలువురు ప్రజా సంఘాల నాయకులను భారీ ఎత్తున సమీకరించాలని దిలీప్ కుమార్, వి.ప్రకాశ్, డి.రవీంద్రనాయక్, డాక్టర్ ఎ.చంద్రశేఖర్, రసమయి బాలకిషన్ వంటి వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాజకీయ ప్రక్రియ ద్వారా, లాబీయింగ్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదని, ఉద్యమాల ద్వారానే సాధ్యమవుతుందంటూ అసమ్మతివాదులు ప్రకటంచారు. తెరాస అధినేత కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ అంశాన్ని దేశ వ్యాప్తంగా తీసుకువెళ్ళినా క్షేత్రస్థాయిలో ఉద్యమాన్ని నిర్మించలేకపోయారని, దీని మూలంగా తెలంగాణవాదం బలహీనపడే అవకాశాలు ఏర్పడ్డాయంటూ వారు ఆరోపిస్తున్నారు.
Pages: 1 -2- News Posted: 28 May, 2009
|