చిరు ఎదుట సవాల్
హైదరాబాద్ : మనుగడ కోసం పోరాటం... ప్రజారాజ్యం పార్టీ ముందున్న పెనుసవాల్ ఇదే. చాలినంత బలం లేకుండా, కనీసం తగినంత ప్రాతినిధ్యం లేకుండా ఐదేళ్ళపాటు అంటే మళ్ళీ ఎన్నికల వరకు ఉనికిని కాపాడుకోవడం ఆ పార్టీ అధినేతకు తలకు మించిన భారమే కాగలదు. రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. అందునా ప్రజారాజ్యంలో ఉన్నదంతా ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి వలసవచ్చిన అతుకులబొంత అభిప్రాయాల నాయకులే. గెలిచినవారిలో అధికులు స్వయం ప్రకాశకులుగా ఇప్పుడు చెప్పుకుంటున్నారు. ఎవరో ఒకరిద్దరు మినహా గంటా శ్రీనివాసరావు, భూమా శోభా నాగిరెడ్డి, ఈలి నాని లాంటి సీనియర్ నాయకుల విజయాల్లో సొంత బలమేకానీ, చిరంజీవి ప్రభావం లేదనే వాదన అప్పుడే మొదలైంది. అంతే కాకుండా ప్రజారాజ్యానికి వెళ్ళిపోయిన తన వాళ్ళను వెనక్కు తెచ్చుకోవడానికి వారివారి మాతృపార్టీలు ఇప్పటికే వలలు వేస్తున్నాయి.
ఈ నేపధ్యంలో ప్రజారాజ్యం పార్టీని ఐదేళ్ళపాటు జనంలో ఉంచడం చిరంజీవికి, ఆయనకు నమ్మిన బంటులుగా ఉన్నవారికి మోయలేని బరువుగానే చెప్పుకోవచ్చు. పార్టీని జనంలో ఉంచాలంటే రాబోయే ఐదేళ్ళూ నిరంతరం కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండాలి. పార్టీ అతి బలహీనంగా ఉన్న దృష్ట్యా మిగతా పార్టీలకు వచ్చినట్టు నిధులు వచ్చే అవకాశం లేదు. జిల్లా స్థాయి నాయకులో, కార్యకర్తలో జేబులోంచి డబ్బులు తీసి పార్టీకి ఎదురుపెట్టుబడి పెట్టి నడిపించే కాలం ఏనాడో చెల్లిపోయింది. అధికారంలో ఉన్నా లేకపోయినా కాంగ్రెస్, తెలుగుదేశం, కమ్యూనిస్టు నాయకులు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని వ్యాపారాలో, కాంట్రాక్టులో, చందాలో పోగుచేసి పార్టీకి ఖర్చుపెట్టేవారు. ప్రస్తుతానికి ప్రజారాజ్యానికి ఉన్న నాయకుల్లో ఇలాంటి స్థోమతు ఎంతమందికి ఉందో చూడాల్సిందే. కాబట్టి ఏదో విధంగా అధికార పార్టీకి విధేయంగా ఉంటూ ఐదేళ్ళూ గౌరవప్రదంగా బయటపడటం అన్నది ఒక వ్యూహం.
Pages: 1 -2- News Posted: 29 May, 2009
|