సోనియా, రాహుల్ అన్వేషణ
న్యూఢిల్లీ : మంత్రి మండలి నిర్మాణం పూర్తయినందున ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇక హాయిగా నిద్రించవచ్చు. కాని సోనియా గాంధికి, రాహుల్ గాంధికి అంత అదృష్టం లేదు. పార్టీ కార్యనిర్వాహక వర్గ సభ్యులు కొందరు ప్రభుత్వంలో మంత్రులుగా చేరినందున ఖాళీ అయిన ఆ పదవులలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధి, ప్రధాన కార్యదర్శి అయిన ఆమె కుమారుడు రాహుల్ గాంధి నియామకాలు జరపవలసి ఉంటుంది. సంస్థాగత యంత్రాంగాన్నిక్రమబద్ధం చేయాలని, సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని, 2010 డిసెంబర్ లోగా సంస్థాగత ఎన్నికలను పూర్తి చేయాలని కూడా వారు యోచిస్తున్నారు.
కొన్ని దశాబ్దాలలో మొదటిసారిగా ఈ సంవత్సరం పంజాబ్, ఉత్తరాఖండ్ లలో నిర్వహించిన యువజన కాంగ్రెస్ ఎన్నికలలో తాను ప్రవేశపెట్టిన 'పారదర్శకత, ప్రజాస్వామ్యం' లక్షణాలు ఎన్నికలలో కూడా కనిపించాలని రాహుల్ పట్టుదలగా ఉన్నారు. సోనియా కాంగ్రెస్ కొత్త ఎంపిలను ఉద్దేశించి మొదటిసారి ప్రసంగించినప్పుడు ప్రభుత్వంతో పార్టీకి సమాన స్థాయి, ఇంకా వీలైతే ప్రాధాన్యత ఉండవలసిన ఆవశ్యకత గురించి నొక్కిచెప్పారు.
రాహుల్ కు 2009 ఎన్నికలలో సోనియా, మన్మోహన్ సింగ్ లతో కాంగ్రెస్ లో సమాన స్థాయిని లాంఛనంగా కల్పించిన తరువాత కార్యనిర్వాహక వర్గ సభ్యుల నియామకంలో సోనియా వలె ఆయన మాటకు కూడా విలువ ఉంటుందని తాము విశ్వసిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ పూల్ లో కొంత కొరత ఉన్నట్లు కనిపిస్తుండడంతో ప్రతిభావంతుల కోసం రాష్ట్రాలలో 'రాహుల్ జీ' ఎలా అన్వేషణ సాగిస్తున్నదీ ఆ వర్గాలు అప్పుడే చెప్పసాగాయి.
మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ పదవుల నుంచి తప్పుకోవచ్చునని భావిస్తున్న నాయకులలో ప్రధాన కార్యదర్శులు గులామ్ నబీ అజాద్, ముకుల్ వాస్నిక్, పృథ్వీరాజ్ చవాన్, వి. నారాయణస్వామి ఉన్నారు. పార్టీ మీడియా విభాగం అధిపతి ఎం. వీరప్ప మొయిలీ, కార్యదర్శి జైరామ్ రమేష్ కూడా పార్టీ పదవులలో నుంచి నిష్క్రమించవలసి ఉంటుంది. 2004లో వలె కాకుండా ఇప్పుడు 'ఒక వ్యక్తికి ఒక పదవి' అనే సూత్రాన్ని కచ్చితంగా అమలుపరచగలరని ఆ వర్గాలు తెలియజేశాయి. 2004లో పార్టీ, ప్రభుత్వ పదవుల మధ్య ఇలా తరచు మార్పులు జరిగాయి.
Pages: 1 -2- News Posted: 30 May, 2009
|