ఎన్టీఆర్ కు `యువ' కిరీటం
హైదరాబాద్ : బాలకృష్ణను పొలిట్ బ్యూరోలోకి తీసుకోవాలంటూ పార్టీ శ్రేణుల్లో వస్తున్న ఒత్తిడికి తోడుగా తెలుగు యువత అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్ ను నియమించాలని పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకత్వం అధినేత చంద్రబాబుపై ఇటీవలి కాలంలో ఒత్తిడి పెంచినట్లు సమాచారం. అయితే అనుబంద సంఘాలను రద్దు చేయడం లేదనీ, వచ్చే సంస్థాగత ఎన్నికల వరకు ఈ సంఘాలు కొనసాగుతాయని చంద్రబాబు ప్రకటించడంతో ఈ పరిస్థుల్లో యువత అధ్యక్షుడిగా ఎన్టీఆర్ ను నియమించడం వల్ల పార్టీలో ఇబ్బందులు వస్తాయని ఆయన మదనపడుతున్నారు. ప్రస్తుతం యువత అధ్యక్షుడిగా వెనకబడిన తరగతులకు చెందిన రవిచంద్రయాదవ్ కొనసాగుతున్నారనీ, ఆయనను తొలగించి ఎన్టీఆర్ ను నియమిస్తే ఈ సామాజికవర్గానికి చెందిన వారు అసంతృప్తి చెందుతారని పార్టీలో ఒక వర్గం భావిస్తోంది. ఒకవేళ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో యువత అధ్యక్షుడిగా ఎన్టీఆర్ ను నియమించకుంటే రానున్న రోజుల్లో సంస్థాగత ఎన్నికలు జరిగాక ఆయనను యువత పీఠంపై కూర్చోబెట్టాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై చంద్రబాబు పూర్తిస్థాయిలో కసరత్తు ప్రారంభించారు. రాజధాని హైదరాబాద్ మేయర్ పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న ధీమాతో ఉన్న ఆయన కార్పొరేటర్లుగా పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతలను ఆయా నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లకు అప్పగించినట్లు సమాచారం. ఒక్కో డివిజన్ నుంచి ముగ్గురేసి అభ్యర్థులను ఎంపిక చేయాలనీ, అందులో పార్టీ కోసం శ్రమించిన వారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని నిర్ణయించారు. డివిజన్ల వారీగా ఓటర్ల వివరాలను సేకరించాలనీ, ఎన్నికల్లోపు కొత్త ఓటర్లను కూడా చేర్పించే బాధ్యతను పోటీ చేసే అభ్యర్థులకు అప్పగించాలని నిర్ణయించారు. నగర శివార్లలోని మునిసిపాలిటీలన్నీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి రావడంతో ఇక్కడ పార్టీకి గతంలో ఉన్న బలాన్ని మరింత ఉధృతం చేసి ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించారు. రెండు మూడు రోజుల్లో అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ ల నియామకపు ప్రక్రియ పూర్తిచేసి ఎన్నికలకు పూర్తిగా సన్నద్ధం కావాలని నిర్ణయించారు.
Pages: 1 -2- -3- News Posted: 19 June, 2009
|