అన్ని పార్టీలదీ అదే తీరు
హైదరాబాద్ : తెరాసలో అసమ్మతి బెడద... ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధి మిత్రా రాజీనామా... టిడిపి ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి పార్టీ నుంచి సస్పెన్షన్... బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి నరేశ్ రాజీనామా... ఒకరిపై ఒకరు వామపక్షాల నేతల విసుర్లు... పిసిసి అధ్యక్షుడు శ్రీనివాస్ సమక్షంలోనే ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కాంగ్రెస్ నాయకులు బాహాబాహీ, ఇటీవల కాలంలో చోటు చేసుకున్న ఈ పరిణామాలు రాష్ట్రంలో రాజకీయ పార్టీ పరిస్థితికి అద్దంపడుతున్నాయి. క్రమశిక్షణకు మారుపేరు, పార్టీ అధినేత మాటకు తిరుగులేదు అనుకుంటున్న పార్టీలు సైతం అసమ్మతితో సతమతమవుతున్నాయి. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కొంచెం అటు ఇటుగా సంక్షోభంలో కూరుకుని ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి.
ఎన్నికల ముందు మహా కూటమి పార్టీలు పరస్పరం నిందించుకోగా ఎన్నికల తర్వాత తమలో తామే కొట్లాడుకుంటున్నాయి. క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకునే తెలుగుదేశం, సిపిఎం, సిపిఐలతో పాటు, తెలంగాణలో కంగుతిన్న తెలంగాణ రాష్ట్ర సమితి, కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసి భంగపడ్డ ప్రజారాజ్యం, పరిమిత బలంతో ఉన్న బిజెపిలో అసమ్మతి కార్యకలాపాలు జోరందుకున్నాయి. మే 16వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ప్రతి రోజూ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల్లో లుకలుకలు బయటపడుతున్నాయి. సిపిఐ, బిజెపిల్లో బహిరంగంగా అసమ్మతి వ్యక్తం చేసినప్పటికీ, లోలోపల ఆ పార్టీ వర్గాలు పార్టీ నాయకత్వం పట్ల కుతకుతలాడుతున్నాయి. అసమ్మతి, తిరుగుబాట్లతో తెరాస ప్రథమ స్థానంలో ఉండగా, ప్రతి రోజూ ఏదో ధిక్కార స్వరమో, లేక గందరగోళ ప్రకటనతోనో టిడిపి, ప్రజారాజ్యం పార్టీలు సతమతమవుతున్నాయి. వివిధ పార్టీల్లో నెలకొన్న సంక్షోభాన్ని పరిశీలిస్తే...
తెరాసలో సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. చివరకు కెసిఆర్ తెరాస అధ్యక్ష పదవికి రాజీనామా చేసేంతవరకు పరిస్థితి వెళ్ళింది. అయితే పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం మేరకు రాజీనామాను కెసిఆర్ ఉంపసంహరించుకున్నారు. తెలంగాణ భవన్ లో 15 తేదీన జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన మాజీ ఎంపి రవీంద్రనాయక్ ను తెరాస కార్యకర్తలు పరాభవించారు. ఆయన అక్కడే కెసిఆర్ ను ఇష్టం వచ్చినట్లు తిట్టి నిష్క్రమించి, పోలీసుకేసు నమోదు చేశారు. ఐదుగురు నేతలను తెరాస నాయకత్వం సస్పెండ్ చేయటంతో పార్టీ సంక్షోభంలో పడింది. తెరాస తరఫున పది మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. మే 16వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే తెరాసలో సంక్షోభానికి బీజం పడింది. ఇప్పుడది పతాక స్థాయికి చేరుకుంది. కెసిఆర్ మేనల్లుడు హరీష్ రావ్, కుమారుడు కె.తారకరామారావుల పెత్తనం పార్టీలో పెరిగి పోయిందని అసమ్మతి నేతలు చెబుతున్నారు. మరోవైపు అసమ్మతి నేత, ఎమ్మెల్సీ కె దిలీప్ కుమార్ నాయకత్వంలో తెలంగాణ విమోచన సమితి ఏర్పాటైంది.
Pages: 1 -2- -3- News Posted: 22 June, 2009
|