వలస పక్షులు ఇంటిముఖం
హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికలకు ముందు వివిధ కారణాలతో తెలుగుదేశం పార్టీని వీడి ఇతర పార్టీలకు వలస వెళ్ళిన సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా సొంత గూటికి చేరుకునే ప్రయత్నంలో తలమునకలై ఉన్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ద్వితీయ శ్రేణి నాయకులు తిరిగి పార్టీలోకి రావాలని ఆయా జిల్లాలకు చెందిన ముఖ్య నేతల ద్వారా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే సీనియర్లను మాత్రం ఇప్పటికిప్పుడే పార్టీలోకి తీసుకోరాదని స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వీరిని చేర్చుకుందామని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆయా జిల్లాల నేతలకు చెప్పినట్లు తెలిసింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి ప్రజారాజ్యం పార్టీలో నిన్న మొన్నటిదాకా కీలక బాధ్యతలు నిర్వర్తించిన కోటగిరి విద్యాధరరావుతో పాటు ఇదే జిల్లాకు చెందిన మరో నలుగురు శాసనసభ్యులు తెదేపాలో చేరేందుకు ఉవ్విళ్ళూరుతున్నట్లు తెలిసింది.
గతంలో తెదేపాలో ఎమ్మెల్యేలుగా ఉన్న మరడాని రంగారావు, పి కనక సుందరరావు, వంకా శ్రీనివాస్, నర్సింహరాజు తదితరులు తెదేపా తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇదే జిల్లాకు చెందిన సుబ్బారాయుడు సైతం పీఆర్పీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సుబ్బారాయుడు తేదేపాలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నా తెదేపాలోని జిల్లా నేతలు ఆయనను తిరిగి పార్టీలోకి తీసుకోరాదని ఇప్పటికే చంద్రబాబును కలిసి చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ సుబ్బారాయుడుని పార్టీలోకి తిరిగి చేర్చుకున్నావిద్యాదరరావు ఈ పార్టీలోకి వచ్చే అవకాశం లేదని ఇద్దరిలో ఒకరు మాత్రమే ప్రజారాజ్యాన్ని వీడే అవకాశం ఉందని తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నలుగురు మాజీ తెదేపా ఎమ్మెల్యేలు సొంతగూటికి చేరాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ఇందులో ఓ ఎమ్మెల్యే ఇప్పటికే చంద్రబాబుతో కలిసి మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ సూచన మేరకే జిల్లాకు చెందిన వారంతా తిరిగి పాతగూటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు కొత్తపల్లి సుబ్బారాయుడు పిఆర్పీలో చేరడం పట్ల కూడా తెదేపాలో నిరసన వ్యక్తమైంది.
Pages: 1 -2- -3- News Posted: 13 July, 2009
|