వామపక్షాల అరణ్యరోదన
హైదరాబాద్ : రాజకీయ పక్షాల మధ్యన ఎన్నికల పొత్తులు పొసగవని చరిత్ర చెబుతున్నా వామపక్షాలు మాత్రం పాత సిద్ధాంతాన్నే పట్టుకుని వేళ్ళాడుతున్నారు. కాంగ్రెస్ ను ఎదుర్కోవడానికి ప్రతిపక్ష పార్టీలన్నీ కూటమిగానే ఉండాలని వాదిస్తున్న వామపక్షాల నేతల పిలుపును ఇతర పార్టీల నాయకులు ఎవరూ పట్టించుకోకపోవడం విశేషం. అధికారంలో ఉన్న పార్టీని ఇరకాటంలో పెట్టడం ద్వారా మనుగడను సాగించడం వామపక్షపార్టీల ఎత్తుగడగా కొనసాగుతోంది. గత ముప్పైయేళ్లుగా ఉభయ కమ్యూనిస్టులదీ ఇదే దారి కావడం గమనార్హం. అయితే తెలుగుదేశంతో లేకపోతే కాంగ్రెస్ తో ఎన్నికల అవగాహన కుదుర్చుకుని ఉన్న బలం కంటే అదనంగా కొన్ని సీట్లు సాధించుకుని రాజకీయాలు చేయడం వామపక్షాలకు అలవాటుగా మారింది. మొన్నటి ఎన్నికల్లో ఈ ఫార్ములా బెడిసికొట్టింది. అయినా స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ను నిలువరించాలంటే ఐకమత్యమే ఆయుధమని ఇప్పటికీ కమ్యూనిస్టు నాయకులు బలంగా నమ్ముతున్నారు.
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పీఆర్పీ - లోక్ సత్తా విడిగా పోటీ చేయడం వల్ల ప్రతిపక్షాల ఓట్లు చీలిపోయి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినందున... ఇకపై అంతా కలసికట్టుగా పోటీచేయాలన్న వామపక్షాల ప్రయత్నాలు ఏమాత్రం సఫలమయ్యేలా లేవు. పీఆర్పీ-లోక్ సత్తాలు ఎవరిదారు వారు చూసుకోవాలని నిర్ణయించుకోవడమే దానికి కారణం. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలయిన తెలుగుదేశం - ప్రజారాజ్యంను కలపాలని శతవిధాల ప్రయత్నిస్తున్న వామపక్షాలకు నిరాశ ఎదురైంది. ఈ విషయంలో అటు రాఘవులు, ఇటు నారాయణ చేస్తున్న రాయబారాలకు ప్రధాన పార్టీ నాయకత్వాల నుంచి ఎలాంటి స్పందన కనిపించ లేదు. మరోవైపు వామపక్షాల కంటే ప్రతిపక్షాల ఐక్యత కోసం ముందుగా రాయబారాలు ప్రారంభించిన పీఆర్పీ నేత దేవేందర్ గౌడ్ కూడా అటు సొంత పార్టీ నాయకత్వం, ఇటు టిడిపి నాయకత్వం మొండి వైఖరితో విసుగెత్తి పోతున్నారు. అయితే, కమ్యూనిస్టు నేతలు మాత్రం నిన్నటి వరకూ ఆ రెండు పార్టీలు కలుస్తాయన్న ధీమాతోనే ఉన్నాయి. తాజాగా, తాము టిడిపితో కలిసేది లేదని పీఆర్పీ అధినేత చిరంజీవి స్పష్టం చేయడంతో ప్రతిపక్షాలు ఏకమవడం అసాధ్యమని తేలిపోయింది. మరోవైపు... లోక్ సత్తా కూడా ఒంటరిగానే పోటీచేస్తానని గతంలోనే ప్రకటించింది.
Pages: 1 -2- -3- News Posted: 23 July, 2009
|