మాజీల్లో తాజా ఆశలు!
హైదరాబాద్: 'రాజకీయమిదమ్ మాద్యంఖలు పదవీసాధనమ్'.. అంటే అతిశయోక్తి కాదు. రాజకీయం ప్రజాసేవ కోసమైతే.. ఆ సేవ చేయడానికి పదవి అవసరమన్నది నేటి నేతల నమ్మకం. అందుకే పదవి కోసం ఆరాటం... పోరాటం! పదవులు దక్కకపోతే.. అలుకలు, నిరసలు, రాజీనామాలు, ఫిరాయింపులు .. నేటి నేతల పదవీపట్టుకు నిదర్శనాలు! బెల్లం చుట్టూ చీమల్లాగా.. పదవీపతుల వెంటే వందిమాగధుల హడావిడి ఉంటుంది. ''ఒక్కసారి మంత్రి చెయ్యి గణనాథా! నిన్నొదిలి పెడితె ఒట్టుపెట్టు గణనాథా!'' అని వాహినీ వారి 'పెద్ద మనుషులు' చిత్రంలో ఏనాడో పదవి మహిమను చాటారు.
అందుకనే.. 2004నాటికి పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులను తెదేపాతో పోరాటానికి సిద్ధం చేసే క్రమంలో భాగంగా 'ఏడవకండి.. ఏడవకండి.. అధికార దూరులారా!' అంటూ అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి గులాం నబీ అజాద్ ఊరడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 10 వేల మంది కాంగ్రెస్ కార్యకర్తలకు పదవులు దక్కుతాయని ఊరించారు. ఆ మాట తు.చ తప్పకుండా అమలు కాలేదని ముఖ్యమంత్రిగా వైఎస్ తొలి ఐదేళ్ల కాలంలో ''పదవో 'రాజ'చంద్రా!'' అని మొరపెట్టుకున్న కాంగ్రెస్ శ్రేణుల పదవీ విలాపాలే చెబుతాయి. వైఎస్ రెండోసారి సీఎం అయ్యాక.. ఎన్నికల్లో ఓడిన తొలి మంత్రివర్గ సభ్యులెవరికీ తన కేబినెట్లో చోటు కల్పించలేదు. గెలిచిన మంత్రులు కొందరు ఆయా జిల్లాల్లో కొంతమంది కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా పని చేశారన్న కారణంగా మంత్రివర్గంలో స్థానాన్ని కోల్పోయారు. ఇలా మంత్రి పదవికి దూరమైన వారిలో ఎన్నికల్లో విజేతలైన పంచాయతీరాజ్ శాఖ మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డి, హోం శాఖ మాజీ మంత్రి కె.జానారెడ్డి ఉన్నారు. జేసీ మంత్రిగా ఉన్నప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో ఇసుక సీనరేజి వివాదంలో, అతని సోదరుడికి సంబంధించిన బస్సుల వివాదంలో ఉన్నారు. ఎన్నికల సమయంలో తెలంగాణ గురించి ప్రస్తావించినందునే జానారెడ్డికి మంత్రి పదవి దక్కలేదని రాజకీయవర్గాల్లో ప్రచారం జరిగింది.
Pages: 1 -2- -3- News Posted: 3 August, 2009
|