పూజారిని శిక్షించాల్సిందే. కానీ? (వరప్రసాద్ గాలిదేవర)
అవును... మహా అన్యాయమే. మహాపరాధమే. దేవుని నగలను దొంగిలించి తాకట్టు పెట్టకోవడం అపచారమే... చట్టరీత్యా నేరం... దైవ సన్నిధిలో పాపం. అనంతకోటి బ్రహ్మండ నాయకుని కోటానుకోట్ల భక్తజన హృదయాలను నొప్పించినందుకు, వారి భక్తి విశ్వాసాలపై దెబ్బకొట్టినందుకు నిస్సందేహంగా అర్చకస్వామి రమణ దీక్షితులు శిక్షార్హుడే. తనది కాని సొమ్మును స్వప్రయోజనాల కోసం కుదువ పెట్టిన నేరానికి అతనిని న్యాయ స్థానం బోనులో నిలబెట్టవలసిందే. కారాగారంలో వేయవలసిందే. కానీ...
శ్రీవారి నగలను తాకట్టు పెట్టిన ప్రధాన అర్చకుడు... అంటూ ఛానళ్లు వార్తను బద్దలు చేసినప్పుడు ప్రతీ వారి మనస్సుల్లో మెదిలిన అర్చకుని రూపం కచ్చితంగా ఇలానే ఉంది... నున్నగా మెరిసే మేను... తళతళలాడే గుండు.. మిలమిల మెరిసే నామాలు... ధవళ వర్ణంతో ధగద్ధగలాడే పట్టు వస్త్రాలను నిండు కుండలా ఉండే పొట్ట మీదకు బిగించి కట్టిన కుదురైన విగ్రహం... బొడ్డు వరకూ వేలాడే బంగారు డాలరు హారాలు... అత్యంత ఖరీదైన మనుషులతో రాసుకుపూసుకు తిరగే చిర్నవ్వు వదనం... రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి లాంటి మహామహులతో చనువుగా సంచరిస్తూ దేవుని ప్రతిరూపంలా కనిపించే పూజారే కన్నుల ముందు సాక్షాత్కరించాడు. శ్రీవారి బోక్కసం నుంచి మూడువందల బంగారు డాలర్లను బోక్కేసినా దర్జాగా తిరిగేస్తూ కులాసాలతో కులికే వ్యక్తుల్లాంటి వాడే అని అందరూ భావించారు. వయస్సు ముదిరిపోయినా పెద్దలను కాకాపట్టి తిరుమల దేవస్థానంలో పదవులను పట్టుకువేలాడుతున్న ముదురు అర్చక స్వాములే గుర్తుకు వచ్చారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చకులందరూ పెట్టి పుట్టిన వాళ్లే అన్నది సామాన్య భక్తుని భావన. శ్రీవారి రథాలపై ఊరేగే పూజారులను టెలివిజన్లలో చూసినప్పుడు వారి దర్పం, ఠీవీ, ఆహార్యం ఆనందాన్నే కలిగిస్తాయి. చీకూచింతా ఇసుమంతైనా కనిపించని ప్రసన్నవదనాలతో లయబద్దంగా, గాత్ర శుద్ధంగా,వీనులకు ఇంపుగా వేద మంత్రోచ్ఛాటన చేస్తుంటే పరమ నాస్తికునికి కూడా భక్తి పారవశ్యం కలిగి తీరుతుంది. తిరుమల అర్చకుల్లో పేదరికాన్ని ఊహించడం చాలా కష్టం.
Pages: 1 -2- -3- News Posted: 23 August, 2009
|