సల్మాన్ కు సాధ్యమయ్యేనా? ముంబై : తెల్ల చొక్కా, నీలి రంగు జీన్స్ ధరించిన సల్మాన్ ఖాన్ ఒక బాడీగార్డ్ తో కలసి ముంబై బాంద్రాలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో ప్రవేశించినప్పుడు అప్పటికే అక్కడ నిరీక్షిస్తున్న జర్నలిస్టులు అది ప్రైవేట్ సందర్శనగా భావించారు. కొన్ని నిమిషాల అనంతరం ఆయన సోదరి, బావగారు అడుగుపెట్టారు. సల్మాన్, ఆయన కుటుంబ సభ్యులు హోటల్ లో నుంచి నిష్క్రమించిన ఒక గంట తరువాత ఆయన ప్రత్యేకంగా ఒక పనిపై వచ్చినట్లు తెలియవచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో ఒక జట్టును కొనుగోలు చేయాలనే ఆసక్తితో సల్మాన్ ఉన్నారు.
'ఏదైనా ఐపిఎల్ జట్టును సొంతం చేసుకునే అవకాశం ఉందేమోనని చర్చించేందుకు ఆయన వచ్చారు' అని ఐపిఎల్ చైర్మన్ లలిత్ మోడి ధ్రువీకరించారు. 'ఆ విషయమై ఆయన పట్టుదలతో ఉన్నారని నా భావన' అని మోడి చెప్పారు.
ఐపిఎల్ ను 2011లో పది జట్ల లీగ్ గా విస్తరించనున్నారు. సల్మాన్ ఈ ప్రయత్నంలో కృతకృత్యుడైన పక్షంలో ఐపిఎల్ ఫ్రాంచైజీలలో వాటాలు ఉన్న లేదా యజమానులుగా ఉన్న బాలీవుడ్ తారాగణంలో షారుఖ్ ఖాన్, ప్రీతీ జింటా, శిల్పా శెట్టి సరసన చేరతారు.
అయితే, ఈ ఉన్నత స్థాయి బృందంలో చేరడం సల్మాన్ కు తేలికేమీ కాకపోవచ్చు. 2011లో ఏ ఫ్రాంచైజీ అయినా భారీగా మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది. 2008లో ఐపిఎల్ యజమానులు చెల్లించిన మొత్తాన్ని అది మించిపోవచ్చు. ఐపిఎల్ పాలక మండలి ప్రాథమిక అంచనాల ప్రకారం, మూల ధనం 250 మిలియన్ డాలర్లు అంటే వెయ్యి కోట్ల రూపాయలకు పైగానే ఉంటుంది. ప్రస్తుత ఐపిఎల్ వ్యవస్థలో అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీ చెల్లించిన ధరకు అది రెట్టింపు పైగానే ఉంటుంది. ముంబై ఇండియన్స్ జట్టును ముకేష్ అంబానీ 111 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. ఇక షారుఖ్ కోలకతా ఫ్రాంచైజీ కోసం 10 సంవత్సరాలకు 76 మిలియన్ డాలర్లు చెల్లిస్తున్నారు.
Pages: 1 -2- -3- News Posted: 27 August, 2009
|