నక్సల్స్ ను తరిమిన వైఎస్ న్యూఢిల్లీ : మావోయిస్టులను తరిమివేయడంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సాధించిన విజయాలు పొరుగు రాష్ట్రాలకు కంటగింపుగా మారాయి. ఆంధ్ర రాష్ట్రంలో నిలువ నీడ కరవవ్వడంతో మావోయిస్టులు ఒరిస్సా, చత్తీస్ ఘడ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ కు తరిలిపోయారు. అక్కడ ఏకంగా స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. కార్యకలాపాలను ఉధృతం చేశారు. విధ్వంసాలను సృష్టించారు. ఛత్తీస్ ఘడ్ లో పోలీసులతో ప్రత్యక్ష యుద్ధానికి తలపడ్డారు. వందలాది మంది పోలీసులను హతమార్చారు. సల్వాజుడుం కార్యకర్తలను ఊచకోత కోశారు. పశ్చిమ బెంగాల్ లో లాల్ ఘడ్ ఏకంగా తమ ఆధిపత్యంలోకి తెచ్చుకున్నారు. రెడ్ కారిడార్ గా తమ ప్రాబల్యం ఉన్న ప్రాంతాలను ప్రకటించుకున్నారు. ఇదంతా వైఎస్ ఆంధ్ర ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత మావోయిస్టులపై ఉక్కుపాదం మోపిన ఫలితమే. ఇక్కడ మనుగడ సాగించలేమని భావించిన మావోయిస్టులు పొరుగురాష్ట్రాలకు తరలిపోయి అక్కడ ఉద్యమాలను నిర్మించారు. తమ రాష్ట్రాల్లో మావోయిస్టు గెరిల్లాలు అందరూ తెలుగు మాట్లాడేవారేనని ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్ రాష్ట్రాల సీనియర్ పోలీసు అధికారులు మొత్తుకున్నారు.
వాస్తవానికి మావోయిస్టులు బెంగాల్ పట్ల సానుభూతితో ఉండేవారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఆ రాష్ట్రాన్ని వారు షెల్టర్ జోన్ గా వినియోగించుకున్నారు. అంతే కాని అక్కడ కార్యకలాపాలను సాగించిన ఉదంతాలు లేవు. కానీ 1999-2000 తరువాత బెంగాల్ లో మావోయిస్టులు అక్కడి వామపక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకలాపాలను ప్రారంభించారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు గ్రేహౌండ్ దళాలను బలోపేతం చేసి, మావోయిస్టు సాయుధ గెరిల్లా దళాలను నామరూపాలు లేకుండా చేయడానికి సన్నద్ధమయ్యారు. 2005-2006 నాటికి వైఎస్ ప్రభుత్వం మావోయిస్టులపై తిరుగులేని ఆధిపత్యం సాధించింది. మానవ కదలికలు దుస్సాధ్యమని భావించే కీకారణ్యం నల్లమల మావోయిస్టులకు పెట్టని కోటగా ఉండేది. వైఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత పోలీసులు నల్లమలను జల్లెడ పట్టి నక్సలైట్లను దాదాపుగా తరిమికొట్టారు. దశాబ్దాల పాటు వారి ఆధీనంలో ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలోని గ్రామాలను ప్రభుత్వం ఆధీనంలోకి తెచ్చుకోగలిగింది.
Pages: 1 -2- -3- News Posted: 4 September, 2009
|