వెలగని వారసులు హైదరాబాద్ : ప్రముఖ నాయకులుగా ప్రజాలను విశేషంగా ప్రభావితం చేసిన నేతలుగా వెలుగొందిన వారి - 'వారసత్వం' సమర్థ వంతంగా కొనసాగిన దాఖలాలు రాష్ట్రంలో లేవు. ప్రస్తుతం రాజకీయాల్లో వారసులుగా పుత్రులు, పుత్రికలు, అల్లుళ్ళు, కోడళ్ళ రంగప్రవేశం విరివిగా జరుగుతోంది. తల్లిదండ్రుల్లో ఎవరు పదవిలో ఉన్నా, వారి 'నీడ'లుగా వారసులు అధికారం చెలాయిస్తున్న ధోరణి దేశంలో పెరుగుతోంది.
ప్రజలను విలక్షణ శైలితో ఆకట్టుకున్న వైఎస్ ఆకస్మిక మృతితో రాష్ట్రంలో మరోసారి రాజకీయ వారసత్వం తెరపైకి వచ్చింది. వైఎస్ కుమారుడు జగన్ ను ముఖ్యమంత్రిగా చేయాలని మంత్రి వర్గం తీర్మానించింది. శాసనసభ్యులు సంతకాల సేకరణతో వినతి పత్రం రూపొందించింది. మరో వైపు రాష్ట్రంలో కొన్ని చోట్ల జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలంటూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన నేతల వారసత్వం ప్రజలపై ప్రభావితం చూపిందా అన్న విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా అయింది.
తెలంగాణ కోసం ఉద్యమించిన మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా 1978-80, 1989-1990 కాలంలో రెండుసార్లు పనిచేశారు. మంచి వ్యూహకర్తగా, సమర్థుడైన పాలకునిగా ఆయనకు పేరుంది. ఆయన అడుగు జాడల్లో నడవడానికి ప్రయత్నిస్తున్న కుమారుడు మర్రి శశిధర్ రెడ్డి ప్రస్తుతం సనత్ నగర్ శాసన సభ్యునిగా ఉన్నారు. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనను వ్యతిరేకించిన దివంగత నేత వైఎస్... మర్రి వారసుడు శశిధర్ రెడ్డికి తన కేబినెట్ లో స్థానం కల్పించలేదు. అయితే అధిష్టానం శశిధర్ రెడ్డికి జాతీయ విపత్తు నివారణ సంస్థ (ఎన్ డీఎంఏ) సభ్యత్వం కట్టబెట్టింది. ఈ పదవితో ఆయనకు కేబినెట్ లో హోదా లభించింది. ఆయన సోదరుడు మర్రి రవీంద్ర రెడ్డి అయితే రాజకీయంగా ఎక్కడా కనిపించడం లేదు.
Pages: 1 -2- -3- News Posted: 5 September, 2009
|