సైంటిస్ట్ పై కక్ష న్యూఢిల్లీ : కాపీ కొట్టారనే ఆరోపణలు, సైంటిస్టుల కుమ్ములాటలు, సంస్థాగతమైన అనౌచిత్యంతో కూడుకున్న అస్తవ్యస్త పరిస్థితులలో అక్రమాలను బయటపెట్టిన ఒక సైంటిస్టును ఒక ఉన్నత విద్యా సంస్థ శిక్షించినట్లు ఆరోపణ వచ్చింది. దేశంలో పరిశోధన రంగం ఎంత దుర్గంధభూయిష్టంగా ఉందో ఇది తేటతెల్లం చేస్తున్నది.
తన శాఖ అధిపతి పరిశోధన పరంగా పాల్పడిన అక్రమాన్ని బయటపెట్టేందుకు ప్రయత్నించిన ఒక సైంటిస్టుపై కక్ష సాధింపు చర్యకు పాల్పడినందుకు చండీగఢ్ సమీపంలోని జాతీయ ఔషధ విద్య, పరిశోధనా సంస్థ (ఎన్ఐపిఇఆర్ - నైపర్)ను ఐదుగురు సభ్యుల దర్యాప్తు బృందం తప్పుపట్టింది. నాసిరకం పని తీరు, క్రమశిక్షణారాహిత్యం ఆరోపణతో ఆర్గానిక్ కెమిస్ట్ అనిమేష్ రాయ్ కాంట్రాక్ట్ ను 2005 అక్టోబర్ లో రెన్యూ చేయడానికి ఆ సంస్థ నిరాకరించింది. ఆయన బర్తరఫ్ కు ముందు ఆయన పనిని సమీక్షించిన ఒక అంతర్గత సంస్థ ఆయన తన ప్రయోగంలో ఉపయోగించిన కొన్ని మిశ్రమాల రసాయనిక లక్షణాలను కూడా సరిగ్గా రాయలేకపోయినట్లు తెలియజేసింది. అయితే, నైపర్ గవర్నర్ల బోర్డు నియమించిన దర్యాప్తు బృందం సంస్థలోని ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ విభాగం అధిపతి ఉత్తమ్ చంద్ బెనర్జీ అనుసరిస్తున్న అనైతిక పరిశోధన పద్ధతులను బట్టబయలు చేసినందుకు రాయ్ ను సంస్థ శిక్షించిందని వెల్లడించింది.
రాయ్ పని తీరును మదింపు వేసేందుకు బృందం నియోగించిన ఇద్దరు స్వతంత్ర సైంటిస్టులు ఆయనకు అత్యున్నత గ్రేడ్ లు ఇచ్చారు. రాయ్ ను పునర్నియమించాలని, బెనర్జీపై చర్య తీసుకోవాలని సంస్థను ఆ బృందం కోరింది. ఆ బృందం నివేదికను క్రితం శనివారం గవర్నర్ల బోర్డు సమావేశంలో ఆమోదించారని సమావేశానికి హాజరైన కొందరు ప్రతినిధులు తెలియజేశారు. (ఆ నివేదిక కాపీ ఒకదానిని 'ది టెలిగ్రాఫ్' పత్రిక సంపాదించింది.) కాగా, ఆ బృందం నివేదికపై వ్యాఖ్యానించడానికి నైపర్ డైరెక్టర్ పి. రామారావు నిరాకరించారు.
రాయ్ వాదనను పరిశీలించిన, దీనిపై దర్యాప్తును కోరిన సైన్స్ నైతిక విలువల నిఘా సంస్థ అభిప్రాయం ప్రకారం, పరిశోధనలో నిజాయితీని పర్యవేక్షించడానికి, అక్రమాలకు పాల్పడినవారిని శిక్షించడానికి ప్రభుత్వ మద్దతు గల ఒక యంత్రాంగం ఉండవలసిన ఆవశ్యకత ఉంది. 'ఇండియాలో సైన్స్ విశ్వసనీయతకు ఇటువంటి ఉదంతాలే హాని కలిగిస్తున్నాయి' అని సైన్స్ నైతిక విలువల నిఘా సంస్థ సొసైటి ఫర్ సైంటిఫిక్ వ్యాల్యూస్ (ఎస్ఎస్ వి) అధ్యక్షుడు, ఐఐటి ఖర్గపూర్ మాజీ డైరెక్టర్ కస్తూరి లాల్ చోప్రా వ్యాఖ్యానించారు.
Pages: 1 -2- -3- News Posted: 9 September, 2009
|