రోశయ్య సొంత కేబినెట్! హైదరాబాద్: జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికి ఏమాత్రం సుముఖంగా లేనట్లు కాంగ్రెస్ అధిష్టానం పంపిన సంకేతాలను రోశయ్య గట్టిగానే పసిగట్టేశారు. వారం రోజుల వ్యవధిలో ఆయన స్వరంలో సుస్పష్టమైన మార్పు కనిపిస్తోంది. మాటల్లో అధికార దర్పం తొంగిచూస్తోంది. నర్మగర్భంగా మాట్లాడటంలో తనకు తనే సాటి అయిన రోశయ్య జగన్ వెంట పడి పరుగులు తీస్తున్న అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలను క్రమంగా తన వెనుక నిలబెట్టుకుంటున్నారు. పార్టీలో అనేక ఒత్తిళ్ళను తట్టుకుని నిలబడే స్థాయికి చేరుకున్న రోశయ్య ఇప్పుడు పాలనపై పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తున్నారు. హైకమాండ్ దన్నుతో బలం లభించిన ఆయన ఇక తన సత్తా ఏమిటో చాటుకోవడంతో పాటు పాలనపై తన సొంత ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రభుత్వ పాలనను గాడిలోపెట్టేందుకు సొంత జట్టును సిద్ధం చేసుకునే కసరత్తు ప్రారంభిం చారు. అందులో భాగంగానే పరిపాలనపై పూర్తిగా దృష్టి సారించే తనకు నచ్చిన, మెచ్చిన వారితో రాష్ట్ర మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకోవా లనే నిర్ణయానికి వచ్చారు. మరో వైపు సిఎం పేషీలో కూడా తనకు నమ్మకస్తులు, సమర్ధులైన అధికారులను నియమించు కునేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణంతో గాడి తప్పిన పాలనను దారిలో తేవడానికి పార్టీ అధిష్టానం రోశయ్యకు పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. హైకమాండ్ నుంచి పూర్తి సహకారం ఉండటంతో ఇక తన మాట వినని, తనను లెక్క చేయని, పాల నపై దృష్టి సారించకుండా గ్రూపు రాజకీయాల చుట్టూ తిరిగే మంత్రులపై వేటు వేయాలని ఆయన నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆమేరకు నెలాఖరులోగా మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణ చేపట్టనున్నట్లు బలమైన వాదనలు వినిపిస్తున్నాయి.
పార్టీ అధిష్టానం తనను సీఎంగా నియమించినా, తాత్కాలిక సీఎమ్మేనంటూ నోరెత్తిన మంత్రులు, అలాగే జగన్ పేరును అడ్డుపెట్టుకుని తనను ఖాతరు చేయని మంత్రులు, అధికారిక సమీక్షా సమావేశాలకు డుమ్మాలు కొట్టిమంత్రాంగాలకు పరిమితమైన మంత్రులపై రోశయ్య వేటు వేయడం ఖాయమైపోయిందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మరో నాలుగేళ్ళ వరకు అధిష్టానం రోశయ్యనే ముఖ్యమంత్రిగా కొనసాగించే అవకాశాలున్న నేపధ్యంలో సమర్ధులు, తనకు విధేయులుగా ఉండి, పార్టీ క్రమ శిక్షణకు కట్టుబడి హైకమాండ్ నిర్ణయాలను గౌరవించే వారిని కొత్తగా మంత్రివర్గంలో చేర్చుకోవాలని ఆయన నిర్ణయానికి వచ్చారు.
Pages: 1 -2- -3- News Posted: 1 October, 2009
|