సైంటిస్టుల కుటుంబం అది వాషింగ్టన్ : సియాటిల్ లోని రిటైర్డ్ ప్రొఫెసర్ సి.వి. రామకృష్ణన్ నివాసంలో టెలిఫోన్ బుధవారం తెల్లవారు జామున 2 గంటలకు మోగసాగింది. వెంకట్రామన్ రామకృష్ణన్ తో మాట్లాడాలని అభిలషిస్తున్నామని కాలర్లు తెలియజేశారు. వారిలో చాలా మంది అమెరికన్ టెలివిజన్ నెట్ వర్క్ లకు చెందినవారే. గాఢ నిద్రలో నుంచి లేపినందుకు కాస్త కోపించిన సి.వి. రామకృష్ణన్ తన కుమారుడు పది సంవత్సరాలుగా ఈ సియాటిల్ ఇంటిలో నివసించడం లేదని మొదటి కాలర్ తో చెప్పారు. 'కాని ఆయన తన వాషింగ్టన్ రాష్ట్ర డ్రైవింగ్ లైసెన్సును రెన్యూ చేసుకున్నది ఇదే చిరునామాతో కదా' అని ఆ కాలర్ గట్టిగా అడిగారు. 'ఆయన యుఎస్ పాస్ పోర్ట్ లో ఉన్న అడ్రెస్ కూడా ఇదే' అని టెలివిజన్ విలేఖరి నొక్కి చెప్పారు.
మంచి నిద్రలో హఠాత్తుగా లేపినందుకు కలిగిన చిరాకును అణచుకోవడానికి ప్రయత్నిస్తున్న సి.వి. రామకృష్ణన్ ఈ అపరాత్రి వేళ తన ఏకైక కుమారునితో మీడియాకు ఏమి పని పడిందో అర్థం కాక సతమతమయ్యారు. ఏదో ఒక సమాధానం చెప్పడానికి ఆయన సిద్ధపడే లోపే టివి రిపోర్టర్ యూరప్ లో అంతకుముందే వెలువడిన గొప్ప వార్త గురించి సి.వి. రామకృష్ణన్ కు తెలియదని గ్రహించి ఆయనతో 'మీ కుమారుడు, కేంబ్రిడ్జి ప్రొఫెసర్ భారతీయ అమెరికన్ వెంకట్రామన్ రామకృష్ణన్ ను 2009లో కెమిస్ట్రీలో నోబెల్ బహుమతి విజేతలు ముగ్గురిలో ఒకరిగా అంతకుముందే ప్రకటించారు' అని చెప్పారు.
ఇది నిజమేనా? లేక మరేదైనా కారణంగా తనను నమ్మించడానికి టివి విలేఖరి ప్రయత్నిస్తున్నారా? సి.వి. రామకృష్ణన్ మదిలో కొన్ని క్షణాలు మెదిలిన సందేహాలు ఇవి. తమ కుమారుడు ఏదో ఒక రోజు బయెకెమిస్ట్రీలో తన కృషికి నోబెల్ బహుమతి పొందగలడని తన భార్య, స్వర్గీయ ఆర్. రాజ్యలక్ష్మి దృఢ నమ్మకంతో చెబుతుండేదని ఆయన వెంటనే గుర్తు చేసుకున్నారు. ఆమె ఆ నమ్మకాన్ని కలిగి ఉన్నది తన ఏకైక కుమారునిపై గల అవ్యాజమైన ప్రేమతో మాత్రమే కాదు. తమ కుమారుడు చేస్తున్న కృషి గురించి రాజ్యలక్ష్మికి, ఆమె భర్తకు క్షుణ్ణంగా తెలుసు.
తమిళనాడులోని చిదంబరంలో జన్మించిన, బరోడాలో చదువుకున్న వెంకట్రామన్ రామకృష్ణన్ బయోకెమిస్టుల కుటుంబానికి చెందినవారు. ఆ కుటుంబం ఎప్పుడూ విద్యకు అత్యధిక ప్రాముఖ్యం ఇస్తుండేది. రాజ్యలక్ష్మి చిదంబరంలో ఒక హైస్కూల్ టీచర్ గా తన కెరీర్ ను ప్రారంభించారు. కోయంబత్తూరులో జన్మించిన సి.వి. రామకృష్ణన్ చిదంబరంలోనే రాజ్యలక్ష్మిని కలుసుకుని ఆమెను వివాహం చేసుకున్నారు. వివాహమైన కొద్దికాలానికే భర్త యూనివర్శిటీ ఆఫ్ విస్కాన్సిన్-మాడిసన్ లో పోస్ట్-డాక్టరల్ ఫెలోషిప్ కోసం అమెరికాకు బయలుదేరి వెళ్ళారు.
Pages: 1 -2- -3- News Posted: 8 October, 2009
|