అంబానీల ముఖాముఖి పోరు ముంబై : భారతదేశంలోని బిలియనీర్లయిన అంబానీ సోదరులు గ్యాస్ ధరల కేసుపై ఈ వారం అత్యున్నత న్యాయస్థానంలో ముఖాముఖి తలపడనున్నారు. వారిద్దరి తరఫున వాదించడానికి అత్యధిక పారితోషికం అందుకుంటుండే న్యాయశాస్త్ర కోవిదులు సిద్ధంగా ఉన్నారు. కుటుంబ ఒప్పందం ప్రకారం, రిలయన్స్ నేచురల్ రిసోర్సెస్ లిమిటెడ్ (ఆర్ఎన్ఆర్ఎల్)కు మార్కెట్ ధర కన్నా తక్కువకు గ్యాస్ విక్రయానికి సంబంధించిన డీల్ పై ముఖేష్ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)కు, అనిల్ సారథ్యంలోని ఆర్ఎన్ఆర్ఎల్ కు మధ్య దాఖలైన కేసులో విచారణను సుప్రీం కోర్టు మంగళవారం ప్రారంభించనున్నది.
సుప్రసిద్ధ పారిశ్రామిక, వాణిజ్యవేత్త ధీరూభాయ్ అంబానీ కుమారులైన ముఖేష్, అంబానీ తమ తల్లి కోకిలాబెన్ పనుపున 2005లో ఒప్పందం కుదిరిన తరువాత తమ తమ వాణిజ్య సంస్థలపై పోరు సాగించడం ఇదే మొదటిసారి కాదు. ఆయిల్, గ్యాస్, రీటైల్, టెలికామ్, వినోదం, ఆర్థిక సేవల రంగాలలో ఇద్దరూ పలు వాణిజ్య సంస్థలను నిర్వహిస్తున్న సంగతి విదితమే. ప్రపంచంలో టాప్ 10 టెలికామ్ సంస్థ సృష్టికి అనిల్ సారథ్యంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థకు, దక్షిణాఫ్రికాలోని ఎంటిఎన్ గ్రూపునకు మధ్య జరిగిన చర్చలకు రెండు సంవత్సరాల క్రితం ముఖేష్ చేసిన ఒక క్లెయిముతో అడ్డుకట్ట పడింది. భారతీయ మొబైల్ సంస్థ వాటాలపై ముందుగా నిరాకరించే హక్కు తమకు ఉందని ముఖేష్ అప్పట్లో ప్రకటించారు.
తమ తల్లి 75వ జన్మదినోత్సవం సందర్భంగా ఇటీవల సోదరులిద్దరూ సంయుక్తంగా ఒక విందు నిర్వహించినప్పుడు వారు తమ విభేదాలకు స్వస్తి చెప్పగలరనే ఆశలు రేకెత్తాయి. గ్యాస్ ధరపై తమ వివాదం పరిష్కారం కోసం తమ తల్లిని ఆశ్రయించవలసిందిగా ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఒక దిగువ కోర్టు న్యాయమూర్తి వారిద్దరికీ సలహా ఇచ్చారు కూడా.
కాని దేశంలోని అనిశ్చిత రెగ్యులేటరీ వాతావరణాన్ని నొక్కిచెబుతున్నదిగా విశ్లేషకులు పేర్కొంటున్న గ్యాస్ ధరల వివాదం ఉభయులూ దాదాపు రోజూ వాగ్బాణాలు సంధించుకోవడానికి దారి తీసింది. వాటాదారుల సమావేశంలో అనిల్ పెద్ద ఎత్తున విరుచుకుపడడం, పెట్రోలియం మంత్రిత్వశాఖ రిలయన్స్ ఇండస్ట్రీస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని ఆరోపిస్తూ దినపత్రికలలో ప్రకటనలు వెలువరించడం విదితమే. అయితే, అనిల్ హఠాత్తుగా తన వైఖరి మార్చుకుని ముఖేష్ కు రాజీ ప్రతిపాదన చేశారు. తమ విభేదాలను పరిష్కరించుకుందామని తన అన్నగారికి అనిల్ సూచించారు. కాని ఇది కుటుంబ తగాదాను మించిన వివాదమని రిలయన్స్ ఇండస్ట్రీస్ వాదించింది.
Pages: 1 -2- -3- News Posted: 19 October, 2009
|