కాంగ్రెస్ టగ్ ఆఫ్ వార్! (డి.వి.రాధాకృష్ణ)
హైదరాబాద్ : కాంగ్రెస్ మార్క్ రాజకీయ వాక్ స్వాతంత్ర్యం మళ్ళీ వీధికెక్కి అట్టహాసం చేస్తోంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల నోటికి హాట్ టాపిక్ గా మారిపోయింది. అధిష్టానం వద్దని ఎంతగా వారించినా ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు ఏదో ఒకటి మీడియాలో వ్యాఖ్యలు చేస్తూ, సరికొత్త వివాదాలకు తెర తీస్తూనే ఉన్నారు. అందరూ బుద్ధిమంతులే. అధిష్టానం మాటను జవదాటకుండా తలలూపుతామని అనేవారే. కాని, వీళ్ళ నోళ్ళకు తాళాలు మాత్రం పడడం లేదు. జగన్ అనుకూల, ప్రతికూల (రోశయ్య అనుకూల?) వర్గాలు ఇప్పుడు మెత్తని కత్తులు దూస్తూనే ఉన్నాయి. మాటల తూటాలు పేల్చుకుంటూనే ఉన్నాయి. రబ్బరు దెబ్బలు కొట్టుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారే 'నాయకులే' కదా!
నిజానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ద్వారా రాజకీయ ప్రయోజనం పొందిన వారు, ఉనికిలోకి వచ్చినవారు, అలాంటి అవకాశాలు రాని వారుగా జగన్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం విషయంలో కొట్టుకు చస్తున్నారు. జగన్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే తమ పదవులకు రాజీనామా చేస్తామంటూ నైరాశ్య, వైరాగ్య, బెదరింపు ధోరణులు ప్రదర్శించేవారు కొందరైతే, అనుభవ హీనుడైన జగన్ కు సిఎం అవకాశం కల్పిస్తే ఇబ్బందులు తప్పకపోవచ్చంటూ వీధికెక్కేవారు మరి కొందరు.
వైఎస్ రాజశేఖరరెడ్డి దుర్మరణం పాలయ్యారన్న వార్త వెలువడిన మరుక్షణం నుంచే జగన్ ముఖ్యమంత్రి కావాలంటూ ఒక్కసారిగా అనూహ్యంగా నినాదం ఒకటి బలంగా దూసుకు వచ్చింది. ఈ క్రమంలో మంత్రులు ఎన్. రఘువీరారెడ్డి, వట్టి వసంత కుమార్, పొన్నాల లక్ష్మయ్య, దానం నాగేందర్, కొండా సురేఖ, రామిరెడ్డి వెంకటరెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తదితరులు జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలంటూ డిమాండ్ చేశారు. అయితే, వైఎస్ మృతితో తక్షణావసరంగా బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి రోశయ్యపై ఎలాంటి అసంతృప్తినీ వ్యక్తం చేయకుండానే, ఆయనను, ఆయన పెద్దరికాన్ని గౌరవిస్తూనే జగన్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందంటూ మనసులోని మాట బయటపెట్టారు. కొంతమంది లౌక్యులు తమది డిమాండ్ కాదని, కోరిక మాత్రమే అని అటు జగన్ కు ఇటు రోశయ్యకు నొప్పి కలక్కుండా సన్నాయి నొక్కులు నొక్కారు.
Pages: 1 -2- -3- News Posted: 21 October, 2009
|