బామ్మల సాకర్ ఆరాటం జనీన్ (దక్షిణాఫ్రికా) : ప్రపంచ కప్ ఫుట్ బాల్ జ్వరం దక్షిణాఫ్రికాలోని బామ్మలకు పట్టుకుంది. వందలాది మంది నిరుపేద, వృద్ధ మహిళలు ఏప్రాన్లు, స్కర్టులు ధరించి తమ తమ బస్తీలలో పోటీలలో బంతి కోసం పెనగులాడుతున్నారు. వారానికి రెండు సార్లు వారు ఇంటి పనులు వదలివేసి ఫుట్ బాల్ ఆటకు వస్తుంటారు. మామూలు రబ్బర్ శాండల్స్ కు బదులు సాకర్ బూట్లను ధరించి స్థానిక పోటీలలో పాల్గొనేందుకు వారు సంసిద్ధులు అవుతుంటారు.
వాఖెగులా వాఖెగులా జట్టులో గల 35 మంది మహిళలు 40, 80 పైచిలుకు వయస్సు గల వారు. జోహాన్నెస్ బర్గ్ కు ఉత్తరంగా 600 కిలో మీటర్ల దూరంలోని జనీన్ దగ్గర గల ఒక బస్తీలో వారు నివసిస్తుంటారు. 'వాఖెగులా వాఖెగులా' అంటే స్థానిక గ్జిట్సోంగా మాండలికంలో 'బామ్మలు' అని అర్థం. ఆ ప్రాంతంలోని ఎనిమిది జట్ల మధ్య పోటీ ఉధృతంగా సాగుతుంటుంది. ఇంటిలో, పొలాలలో చేసే పని కన్నా సాకర్ ఆడడమే శ్రేష్ఠమైన వ్యాయామమని ఆ మహిళలు చెబుతుంటారు.
'నేను సాకర్ ఆడేందుకు ఇష్టపడతాను. ఎందుకంటే ఇది మాకు మేలు చేస్తుంది. మేము అస్వస్థులం. కాని ఇప్పుడు మా శరీర ఉష్ణోగ్రతలు, రక్తపు పోట్లు తగ్గిపోయాయి. మేము వైద్య పరీక్ష నిమిత్తం వెళ్ళినప్పుడు మా డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు' అని 47 సంవత్సరాల నారీ బలోయి చెప్పింది. ఆమె జట్టులోని పిన్న వయస్కులలో ఒకర్తె.
నోరా మాఖుబెలా ఆరుసార్లు గుండెపోటుకు గురైంది. అయినప్పటికీ 83 ఏళ్ళ ఆ ముత్తవ్వ బంతిని అటూ ఇటూ తన్నుతుండడం తనకు ఎన్నడూ ఊహించనంత బలాన్ని ఇచ్చిందని చెప్పింది. 'నా జీవితం మారిపోయింది. నేను ఇప్పుడు నీతో పరుగెత్తవలసి వస్తే, నీకన్నా ఎంతో ఎక్కువ వయస్సులో ఉన్నా నిన్ను ఓడించగలను' అని ఒక వార్తా సంస్థ విలేఖరితో ఆమె అన్నది. కాగా, వచ్చే సంవత్సరం జూన్ 11 నుంచి నెల రోజుల పాటు దక్షిణాఫ్రికాలో జరగనున్న ప్రపంచ కప్ సాకర్ టోర్నీని తిలకించేందుకు తాను జీవించి ఉండాలని మాఖుబెలా ఆకాంక్షిస్తున్నది. '2010 వరకు నేను బతికి ఉండేలా చూడవలసిందని నేను భగవంతుని రోజూ ప్రార్థిస్తున్నాను. పోటీలను తిలకించాలని నేను ఎంతో కోరుకుంటున్నాను' అని ఆమె చెప్పింది.
Pages: 1 -2- -3- News Posted: 23 October, 2009
|