కోర్టుల్లో ఇక వాయిదాలుండవ్! న్యూఢిల్లీ : వాయిదాల ప్రసక్తే లేదు. ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు కోసం కోర్టుల చుట్టూ తిరిగే పని ఉండదు. హైకోర్టు న్యాయమూర్తుల నియామకపు ప్రక్రియ వ్యవధిని ఆరు మాసాల నుంచి కేవలం ఎనిమిది వారాలకు కుదిస్తారు. దేశంలోని న్యాయస్థానాలలో కొండంత ఎత్తున పేరుకుపోతున్న కేసుల పరిష్కారానికి ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ప్రభుత్వం తలపెట్టిన సాహసోపేత ప్రణాళికలో ఇవి మచ్చుకు కొన్ని. ఇబ్బడి ముబ్బడిగా కేసులు పెండింగ్ లోఉండిపోతుండడంతో న్యాయ ప్రక్రియ సుదీర్ఘమైనదిగాను, వ్యయభరితమైనదిగాను మారిపోయిన సంగతి విదితమే.
'లక్ష్య పత్రం'గా నామకరణం చేసిన సంస్కరణల ప్రణాళికకు హైలైట్గా పేర్కొనదగినది 'వాయిదాలకు స్వస్తి చెప్పాలనేది'. న్యాయ రథ చక్రాలకు అడ్డుపడుతున్న 2.74 కోట్ల పెండింగ్ కేసులను వదిలించుకొనే విధానంపై సమగ్ర చర్చ కోసం శనివారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో సమావేశం అవుతున్న న్యాయాధికారులకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి వీరప్ప మొయిలీ ఈ ప్రణాళికను అందజేయనున్నారు.
ట్రాఫిక్ చలాన్ల సమస్య పరిష్కారమే కోర్టులకు, ప్రజలకు పెద్ద తలనొప్పి వ్యవహారంలా మారింది. జనం ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు కోసం ఇబ్బందికర పరిస్థితులలో దాదాపు ఒక పూటంతా కోర్టులలో గడపవలసి వస్తున్నది. సత్వర న్యాయానికి అవరోధంగా ఉన్న ప్రధాన సమస్య ఇదేనని గుర్తించిన ప్రభుత్వం వెబ్ ఆధారిత పరిష్కారాన్ని ప్రతిపాదించింది.
Pages: 1 -2- -3- News Posted: 24 October, 2009
|