పరువు కోసం పిఆర్పీ పోరు హైదరాబాద్ : సామాజిక మార్పు తెస్తాం, అధికారంలో పాగా వేస్తామంటూ రాష్ట్ర రాజకీయాల్లోకి కెరటంలా వచ్చిన ప్రజారాజ్యం పార్టీ ఇప్పుడు పరువు కోసం పాకులాడుతోంది. కనీసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) ఎన్నికల్లో అయినా గౌరవనీయమైన సంఖ్యలో తమ అభ్యర్థులను గెలిపించుకోవాలని, తద్వారా పోయిన పరువును తిరిగి సంపాదించుకోవాలన్న వ్యూహంతో నాయకులు పావులు కదుపుతున్నారు. ఈ మేరకు జిహెచ్ఎంసి పరిధిలోని అన్ని 150 డివిజన్లలోనూ పిఆర్పీ అభ్యర్థులను బరిలోకి దింపనున్నట్లు ఆ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, యువరాజ్యం కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ శ్రావణ్ ప్రకటించారు. ఒకవైపున అన్ని డివిజన్లలోనూ పోటీ చేస్తామని చెబుతూనే మరో పక్కన తమతో భావ సారూప్యం ఉన్న పార్టీలు ముందుకు వస్తే వాటితో కలిసి నడిచేందుకు ఎలాంటి అభ్యంతరమూ లేదని ఈ సందర్భంగా శ్రావణ్ చెప్పడం గమనార్హం.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారపగ్గాలు మెగాస్టార్ కొణిదెల చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీ చేతుల్లోకే వచ్చేస్తాయేమో అన్నంతగా ఊహాగానాలు జరిగాయి. అయితే అనూహ్యంగా కేవలం 18 అసెంబ్లీ స్థానాల్లోనే ఆ పార్టీ అభ్యర్థులు అసెంబ్లీలో అడుగుపెట్టగలిగారు. చిరంజీవి చిత్తూరు జిల్లా తిరుపతి, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసినప్పటికీ కేవలం తిరుపతి నుంచి మాత్రమే విజయం సాధించడం, ప్రతిష్టాత్మకంగా మారిన పాలకొల్లులో దారుణంగా ఓడిపోవడం పార్టీ శ్రేణులను మరింత కుంగదీసింది. అసెంబ్లీలో తృతీయ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిన నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన అనేక మంది నాయకులు మళ్ళీ దారులు వెతుక్కొని సొంత పార్టీలకే ఎగిరెళ్ళిపోయారు. వారిలో తమ్మినేని సీతారామ్, తూళ్ళ దేవేందర్ గౌడ్, ఇనుగాల పెద్దిరెడ్డి తదితరులున్నారు. ఎన్నికల ముందు పిఆర్పీలో చేరి రాజమండ్రి లోక్ సభా స్థానం బరిలో నిలిచి ఓటమి పాలైన రెబల్ స్టార్ కృష్ణంరాజు, పార్టీ ఆవిర్భావం నుంచీ చిరంజీవికి వెన్నుదన్నుగా నిలిచిన కెఎస్సార్ మూర్తి తదితరులు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రాపకం కోసం పాకులాడుతున్నారు.
Pages: 1 -2- -3- News Posted: 29 October, 2009
|