శిశు నిర్ధారణకు శిక్ష ముంబై : గర్భం దాల్చిన తరువాత, గర్భధారణకు ముందు సెక్స్ ఎంపిక కోసం డయాగ్నోస్టిక్ పరీక్షలను నిషేధిస్తున్న చట్టాన్ని ఉల్లంఘించినందుకు ముంబైలో ఒక న్యాయస్థానం ఇద్దరు వైద్యులను దోషులుగా నిర్ధారించి వారికి మూడేళ్ల కారాగార శిక్ష విధించింది. ముంబైలో ఇటువంటి తీర్పు వెలువడడం ఇదే ప్రథమం.
'మగశిశువు కావాల'ని కోరుకునే వారికి ప్రత్యేక చికిత్స చేయగలమని హామీ ఇస్తూ 2004 నవంబర్ లో ఒక వారపత్రికలో ప్రచురించిన ఒక వాణిజ్య ప్రకటన వల్ల 42 సంవత్సరాల హోమియో వైద్యురాలు ఛాయా టాటెడ్, దాదర్ లో శ్రీ మెటర్నిటీ నర్సింగ్ హోమ్ ను నడిపే 62 సంవత్సరాల డాక్టర్ శుభాంగి అడ్కర్ ఈ కేసులో ఇరుక్కున్నారు. ఔరంగాబాద్ లో ఉంటుండే టాటెడ్ నెలలో రెండు ఆదివారాలు దాదర్ నర్సింగ్ హోమ్ లో ప్రాక్టీస్ చేస్తుంటారు.
'గర్భధారణకు ముందు, ప్రసవానికి ముందు డయాగ్నోస్టిక్ పద్ధతుల (సెక్స్ ఎంపిక నిషేధం) (పిఎన్ డిటి) చట్టం 2003'ను నాలుగు సార్లు ఉల్లంఘించినందుకు ఆ డాక్టర్లను దోషులుగా ముంబైలోని దాదర్ షిండేవాడి కోర్టు మేజిస్ట్రేట్ ఆర్.వి. జంబ్కర్ నిర్ధారించారు. కాగా, వారిని దోషులుగా కోర్టు తేల్చడమే కాకుండా ఔదార్యం కోసం వారు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చి , ఈ చట్టం కింద అనుమతించిన గరిష్ఠ శిక్ష - మూడు సంవత్సరాల కారాగార శిక్షను వారికి విధించడం గమనార్హం. కోర్టు వారికి గరిష్ఠంగా రూ. 10 వేలు జరిమానా కూడా విధించింది. ఒక్కొక్క డాక్టర్ మొత్తం రూ. 30 వేల వరకు జరిమానా చెల్లించవలసి ఉంటుంది. అయితే, ఐదు సంవత్సరాల క్రితం తమపై క్రిమినల్ కేసు విచారణ ప్రారంభమైనప్పటి నుంచి డాక్టర్లు ఇద్దరూ బెయిలుపై ఉన్నారు. ఈ కేసులో నేర నిర్ధారణ జరిగిన తరువాత కూడా వారు బెయిలుపై కొనసాగనున్నారు.
భ్రూణ హత్యలను నివారించడానికి ఈ చట్టాన్ని ఉద్దేశించారు. కాని చట్టాన్ని పటిష్ఠం చేయడానికి 2003లో సవరణ చేసిన తరువాత కూడా చట్టం అమలు నిజంగా ఉండవలసిన స్థాయిలో లేదని, దేశవ్యాప్తంగా నేరస్థుల నిర్ధారణలు బాగా తక్కువగా ఉన్నాయని ఆరోగ్య, శిశు సంక్షేమ నిపుణులు అనేక మంది అభిప్రాయపడుతున్నారు.
అయితే, ఈ కేసులో నిందితులు ఇద్దరూ డాక్టర్లని, 'సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు' అని, 'అటువంటి వ్యక్తులు హీనమైనవే కాకుండా సమాజం ఉనికికే భంగకరమైన నేరాలు చేసినప్పుడు వారు ఔదార్యానికి అర్హులు కారు. ఎందుకంటే వారు తమ చర్య ద్వారా ఆడ పిండం లింగ నిర్ధారణను, తద్వారా అటువంటి గర్భం నివారణను ప్రోత్సహించారు' అని మేజిస్ట్రేట్ అభిప్రాయం వెలిబుచ్చారు.
Pages: 1 -2- -3- News Posted: 2 November, 2009
|