కారైనా లేదు - బైకు ఉంది న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు తమ ఆస్తుల వివరాలను మొట్టమొదటిసారిగా బహిర్గతం చేశారు. అయితే, ఆ సమాచారం సమగ్రంగా లేదని న్యాయ కోవిదులు చెబుతున్నారు. కొన్ని ఆస్తుల విలవలను ప్రస్తుత మార్కెట్ రేట్ల ప్రకారం జరిగి ఉండకపోవచ్చునని వారంటున్నారు.
తనకు ఒక శాంత్రో కారు, 20 సవర్ల బంగారం ఉన్నట్లు ప్రకటించిన ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) కె.జి. బాలకృష్ణన్ ఫరీదాబాద్ లో రూ. 4.5 లక్షలు విలువ చేసే 444 చదరపు గజాల ప్లాట్ ఒకటి ఉన్నట్లు తెలియజేశారు. అంటే ఈ స్థలం రేటు చదరపు అడుగు సుమారు రూ. 112 అన్నమాట. అయినప్పటికీ, సుప్రీం కోర్ట్ వెబ్ సైట్ 'supremecourtofindia.nic.in'లో పొందుపరచిన 21మంది సిట్టింగ్ జడ్జీలు, రిటైరైన ఒక జడ్జీ ప్రకటించిన ఆస్తుల వివరాలను గమనిస్తే, సగటు రాజకీయ నాయకుని కన్నా సగటు భారతీయ న్యాయమూర్తి సంపదే తక్కువ అని విదితం కాగలదు.
అసాధారణంగా గుట్టుగా ఉండే భారతీయ న్యాయవ్యవస్థకు సంబంధించి ఈ ఆస్తుల వివరాల ప్రకటన ఒక చిన్న ముందడుగు అని న్యాయవాదులు కొందరు వ్యాఖ్యానించారు. కాని మరింత పారదర్శకతను, జవాబుదారీతనాన్ని కోరుతున్న హక్కుల కార్యకర్తలకు మాత్రం ఇది పెద్ద విజయం అని వారు పేర్కొన్నారు. న్యాయమూర్తుల ఆస్తుల వివరాలు ఈ కింద విధంగా ఉన్నాయి:
జస్టిస్ వి.ఎస్. శిర్పూర్కర్ కు కారు లేదు. కాని ఆయన భార్యకు ఫోర్డ్ ఐకాన్ కారు ఉన్నది. భవిష్యత్తులో సిజెఐ కాగల జస్టిస్ పి. సదాశివంకు 2001లో కొన్న యమహా మోటార్ సైకిల్ ఉన్నది. జస్టిస్ జె.ఎం. పాంచాల్ చెల్లించని బిల్లుల రూపంలో అహ్మదాబాద్ లో రూ. 4.19 లక్షల మేరకు తన కార్పెంటర్ కు, కొందరు వర్తకులకు బకాయి ఉన్నారు. ఆయన రాన్చోడ్ భాయ్ వీర్చన్ భాయి పటేల్ అనే వ్యక్తి దగ్గర రూ. 30 లక్షల మేరకు రుణం తీసుకున్నారు. ఘజియాబాద్ కోర్టు ఖజానా కుంభకోణం (లేదా ప్రావిడెంట్ ఫండ్ కుంభకోణం)లో పేరు ప్రస్తావనకు వచ్చిన జస్టిస్ తరుణ్ చటర్జీ తన ఆస్తుల విలువను ద్రవ్య రూపంలో మదింపు వేయలేదు.
Pages: 1 -2- -3- News Posted: 3 November, 2009
|