భారత్ లో యుఎస్ వర్శిటీలు న్యూఢిల్లీ : భారతదేశంలో 'ప్రపంచ శ్రేణి' విశ్వవిద్యాలయాలను స్థాపించే కృషిలో పాలు పంచుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని మసాచ్యుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి), యేల్ వర్శిటీ అధికారులు తెలియజేసినట్లు ఢిల్లీలో ప్రభుత్వ అధికారులు చెప్పారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్ డి) శాఖ మంత్రి కపిల్ సిబల్ నాయకత్వంలో అమెరికా సందర్శించిన అధికారుల ప్రతినిధివర్గంతో చర్చలు జరిపినప్పుడు ఈ రెండు విశ్వవిద్యాలయాలు ప్రతిపాదిత విశ్వవిద్యాలయాల స్థాపనలో సాయం చేసేందుకు సుముఖత వ్యక్తం చేశాయని అధికారులు తెలిపారు.
ఈ విశ్వవిద్యాలయాలు, ఇండియా మధ్య ఈ విషయమై ఎటువంటి అవగాహన పత్రం (ఎంఒయు)పైన సంతకాలు ఇంకా జరగలేదని అధికార వర్గాలు తెలిపాయి. ప్రతిపాదిత కొత్త విశ్వవిద్యాలయాలు ప్రపంచ విజ్ఞాన కేంద్రాలుగా ఆవిర్భవించగలవని ప్రభుత్వం ఆశిస్తున్నది.
భారత ప్రతినిధివర్గంతో చర్చల సమయంలో తన సుముఖతను విశ్వవిద్యాలయం వ్యక్తం చేసినట్లు ఎంఐటి సీనియర్ అధికారి ఒకరు ధ్రువీకరించారు కూడా. ఈ విధమైన సహకారం వల్ల ఈ వినూత్న విశ్వవిద్యాలయాలను ప్రపంచ శ్రేణి ఉన్నత విద్యా సంస్థలుగా తీర్చిదిద్దడానికి వీలు కలుగుతుందని భారత అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఇండియాతో సహకరించేందుకు కనీసం మరి రెండు అమెరికన్ విశ్వవిద్యాలయాలు కూడా ఆసక్తి కనబరచినట్లు ఢిల్లీలో అధికార వర్గాలు తెలియజేశాయి. అయితే, వాటిలో ఒకటైన హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి నమ్మకం కలిగేలా మరింత కృషి చేయవలసి ఉంటుందని ఆ వర్గాలు సూచించాయి. భారత ప్రతినిధివర్గం హార్వర్డ్ ను కూడా సందర్శించింది. భారత ప్రతినిధివర్గం అక్టోబర్ 24, నవంబర్ 1 మధ్య పలు అమెరికన్ విశ్వవిద్యాలయాలను సందర్శించి భారతదేశంలో తమ కాంపస్ లను ఏర్పాటు చేయవలసిందని, 14 వినూత్న విశ్వవిద్యాలయాల ఏర్పాటులో సాయం చేయవలసిందని విజ్ఞప్తి చేసింది. అమెరికన్ విశ్వవిద్యాలయాలను ఆకర్షించేందుకు భారత ప్రభుత్వం తరఫున జరిగిన మొదటి పర్యటన ఇది.
Pages: 1 -2- -3- News Posted: 6 November, 2009
|