'ఢిల్లీయేతరుడే బిజేపీ చీఫ్'
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ (బిజెపి) వ్యవహారాలలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) జోక్యం చేసుకుంటున్నదనడానికి సూచికగా సంఘ్ అధ్యక్షుడు మోహన్ భాగవత్ 'ఢిల్లీకి చెందని నాయకుడే' బిజెపికి తదుపరి అధ్యక్షుడు కావాలని స్పష్టం చేశారు. అంటే పార్టీ సీనియర్ నేతలు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, ఎం. వెంకయ్య నాయుడు, అనంత కుమార్ లలో ఎవరూ ఈ పదవికి అభ్యర్థులు కాలేరన్నమాట.
డిసెంబర్ లో పదవిలో నుంచి తప్పుకోనున్న బిజెపి అధ్యక్షుడు రాజనాథ్ సింగ్ స్థానంలో మహారాష్ట్ర నాయకుడు నితిన్ గడ్కారి ఈ పదవిని చేపట్టేందుకు ఇతోధిక అవకాశాలు ఉన్నాయని ఆర్ఎస్ఎస్ చీఫ్ స్పష్టీకరణ వల్ల విదితమవుతున్నది. 'అవును. ఈ నలుగురూ కాకుండా మరొకరెవరో కొత్త అధ్యక్షుడు అవుతారు. నేను చెప్పిందిదే. దీనికే అంగీకరించారు. కొత్త అధ్యక్షుని ఎంపిక ప్రక్రియ కూడా తదనుగుణంగానే ప్రారంభమై ఉంటుందని నా విశ్వాసం' అని భాగవత్ ఒక వార్తా పత్రిక విలేఖరితో అన్నారు.
బిజెపి విషయమై ఆర్ఎస్ఎస్ అంటీముట్టని వైఖరి అనుసరిస్తుంటుందనే అపోహేనని భాగవత్ నిర్ద్వంద్వంగా చేసిన ఈ ప్రకటనతో విదితం అవుతున్నది. ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ ఆదేశాలు ఇవ్వదంటూ ఎప్పుడూ చెప్పే మాటలనే ఆయన ఇప్పుడూ చెప్పినప్పటికీ, 'ఆర్ఎస్ఎస్ ఎన్నడూ జోక్యం చేసుకోదు. కేవలం సలహాలు ఇస్తుంది' అని పేర్కొన్నప్పటికీ పార్టీ వ్యవహారాలలో ఇప్పటికే కల్పించుకుంటున్నదనే వాదనకు సంఘ్ ఈ ప్రకటనతో బలం చేకూరుస్తున్నది.
Pages: 1 -2- -3- News Posted: 7 November, 2009
|