వారసత్వాలకు ఇక చెక్ న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో తమ అభ్యర్థి రాజ్ బబ్బర్ విజయం సాధించడంపై కాంగ్రెస్ సంతోషిస్తుండవచ్చు. కాని నేతలు తమ కుటుంబ సభ్యులను రాజకీయ రంగంలోకి తీసుకువచ్చే ధోరణి అంతకంతకు పెరుగుతుండడంపై తమ చిరాకును వోటర్లు ఈ విధంగా ప్రదర్శించి ఉండవచ్చుననే భావన వారి ఆనందానికి అడ్డుకట్ట వేస్తున్నది.
ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ పునరుత్థానానికి ఇది సూచికగా పార్టీ వాదులు చెప్పుకుంటున్నారు. సరే మరి సోషలిజం పేరిట లోపాయకారీగా కుటుంబ పాలనను ప్రవేశపెట్టడానికి ములాయం సింగ్ యాదవ్ చేసిన ప్రయత్నానికి రాజ్ బబ్బర్ కు విజయం చేకూర్చడం ద్వారా వోటర్లు గండి కొట్టారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంగీకరిస్తున్నారు. సమాజ్ వాది పార్టీకి బలమైన కోట ఫిరోజాబాద్ లో ములాయం కోడలు డింపుల్ యాదవ్ పై రాజ్ బబ్బర్ 85 వేలకు పైగా వోట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
ములాయం ఆనువంశిక రాజకీయాలను ప్రజలు తిరస్కరించారని ఈ ఫలితం సూచిస్తున్నదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఉత్తర ప్రదేశ్ వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. దేశంలో సిసలైన ఆనువంశిక రాజకీయాలకు శ్రీకారం చుట్టినదిగా జనం భావిస్తున్న పార్టీకి చెందిన నాయకుడు ఒకరు ఈవిధమైన వ్యాఖ్య చేయడం సాహసమే.
అయితే, తీవ్ర పరిణామాలకు దారి తీయగల ఈ ప్రశ్నను ఎదుర్కొనడానికి కాంగ్రెస్ నాయకులు సుముఖత చూపుతున్నారు. జాతీయ స్థాయిలో లేదా రాష్ట్ర స్థాయిలో బడా లేదా చోటా పార్టీ నాయకులు తెగించి ఇటీవలి ఎన్నికలలో తమ సంతానాన్ని బరిలోకి దింపేందుకు ప్రయత్నించారు. పలువురు ముఖ్యమంత్రుల ఇటీవలి కాలంలో లోక్ సభకు తమ కుమారులు ఎన్నికయ్యేట్లు చూశారు.
Pages: 1 -2- -3- News Posted: 11 November, 2009
|