సుష్మా తెచ్చిన తంటా న్యూఢిల్లీ : పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ వయస్సుపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకురాలు సుష్మా స్వరాజ్ విసిరిన వ్యంగ్యోక్తి రెండు ప్రశ్నలకు తావిస్తున్నది. సుష్మా స్వరాజ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, 'ప్రణబ్ దా కో అక్సర్ గుస్సా ఆ జాతా హై. కుఛ్ తో ఆగే కా అసర్ హై ఔర్ ప్రెషర్ భీ బఢ్ జాతా హై (ప్రణబ్ ముఖర్జీ తరచు కోపానికి గురవుతుంటారు. అందుకు కొంత కారణం ఆయనకు వయస్సు మీరడం కాగా, ఆయన రక్తపు పోటు (బిపి) కూడా పెరుగుతుంటుంది)' అని వ్యాఖ్యానించారు.
74 ఏళ్ల ప్రణబ్ ముఖర్జీకి ఆర్థిక మంత్రిగాను, లోక్ సభ నాయకుడుగాను తన బాధ్యతలను నిర్వహించలేనంతగా వయస్సు మీరిందా? మరి ప్రతిపక్ష నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ సంగతేమిటి? ఒక యువ నేతకు మార్గాన్ని సుగమం చేస్తూ తప్పుకోవలసిందిగా అద్వానీని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కోరగా సుష్మా కూడా సభ్యురాలైన కోటరీ ఆ ప్రతిపాదనను వ్యతిరేకించిన సంగతి విదితమే. లోక్ సభలో అద్వానీ తరువాత ప్రతిపక్ష నాయకురాలిగా బాధ్యతలను సుష్మా స్వరాజ్ స్వకరించబోతున్నారు మరి.
82 ఏళ్ల వయస్సులో అద్వానీకి తన పదవిలో కొనసాగే యోగ్యత ఉండగా 74 ఏళ్ల ప్రణబ్ ఎలా అయోగ్యుడు అవుతారో అంతుపట్టడం లేదు' అని సీనియర్ మంత్రి ఒకరు అన్నారు. ప్రణబ్ ముఖర్జీకి తన బాధ్యతలు నిర్వహించలేనంతగా వయస్సు మీరిందని రాజకీయ వర్గాలలో ఏ ఒక్కరూ భావించడం లేదు. వాస్తవానికి ఆయన తన మానసిక శక్తికి చివరకు అద్వానీ నుంచి కూడా మన్ననలు అందుకున్నారు. ఇక కాంగ్రెస్ సభ్యులకైతే ప్రణబ్ ముఖర్జీపై అపార గౌరవం ఉంది. ఆయనకు గల అసాధారణ జ్ఞాపకశక్తిని సీనియర్ నాయకులు కూడా ప్రస్తావిస్తుంటారు.
Pages: 1 -2- -3- News Posted: 2 December, 2009
|