ముచ్చటగా మూడో వాయిదా? హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ సమావేశాలు సోమవారం అర్ధంతరంగా నిరవధికంగా వాయిదా పడడంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అంశం శాసన సంబంధమైన ఊబిలో చిక్కుకున్నట్లయింది. గత 40 సంవత్సరాలలో ఇలా ప్రత్యేక రాష్ట్రం అంశంపై సభ అర్ధంతరంగా నిరవధికంగా వాయిదా పడడం ఇది మూడవ సారి.
`జై తెలంగాణ', `జై సమైక్య ఆంధ్ర' నినాదాలు ప్రతిధ్వనిస్తుండగా స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. శీతాకాల సమావేశాలు మొదలై అప్పటికి ఏడు రోజులు మాత్రమే అయింది. ఈ సమావేశాలు డిసెంబర్ 23 వరకు కొనసాగవలసి ఉంది. అయితే, రాయలసీమ, కోస్తా ఆంధ్ర ప్రాంతాల సభ్యులు తనకు పంపిన 139 రాజీనామా లేఖలపై స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోవలసి ఉంది.
విశాఖపట్నంలో నిరాహార దీక్ష చేస్తున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థి మృతి చెందడంతోను, రాయలసీమలో మరొక విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతోను కోస్తా ఆంధ్ర వ్యాప్తంగా దౌర్జన్య కాండ సాగుతున్నట్లు వార్తలు వచ్చిన కొన్నిగంటలలోనే శాసనసభను నిరవధికంగా వాయిదా వేశారు.
తెలంగాణపై కేంద్రం ప్రకటనకు నిరనససూచకంగా క్రితం వారం రాజీనామా చేసిన కాంగ్రెస్ కు చెందిన విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ రాష్ట్ర రాజధానిలో తలపెట్టిన నిరాహార దీక్షను భగ్నం చేయడానికై పోలీసులు సోమవారం ఉదయం హైదరాబాద్ విమానాశ్రయంలో ఆయనను అరెస్టు చేశారు. ఆతరువాత ఆయనను విడుదల చేశారు. కాని సమైక్య ఆంద్ర కోసం నిరాహార దీక్షకు ఉపక్రమించడానికై లాల్ బహదూర్ స్టేడియానికి కోస్తా ఆంధ్ర, రాయలసీమ శాసనసభ్యులు కొందరితో కలసి లగడపాటి సాయంత్రం వెళుతుండగా పోలీసులు ఆయనను తిరిగి నిర్బంధంలోకి తీసుకున్నారు.
Pages: 1 -2- -3- News Posted: 15 December, 2009
|