మమత ఓటు సమైక్యాంధ్రకే! న్యూఢిల్లీ : తెలంగాణపై ప్రకటనతో తేనెతుట్టెను కదిపిన కేంద్రం అగమ్య గోచర స్థితిలో పడిపోగా ఈ విషయమై నింపాదిగానే వ్యవహరించవలసిందిగా మమత బెనర్జీ, ఇతర మిత్ర పక్షాల నాయకులు కొందరు మంగళవారం కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చారు. ప్రాంతీయ విధేయతలు మంగళవారం పార్లమెంట్ ను కుదిపివేసిన తరువాత ఈ విషయమై హడావిడి పడవద్దని కేంద్రానికి వారు సలహా ఇచ్చారు.
ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అధ్యక్షతన రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సిసిపిఎ) సమావేశం జరిగిన అనంతరం 'శాంతి సామరస్యాలను కాపాడవలసిందిగా' రాష్ట్ర ప్రజలకు, రాజకీయ పార్టీలకు ప్రభుత్వం మంగళవారం రాత్రి విజ్ఞప్తి చేసింది. తృణమూల్ కాంగ్రెస్ (టిసి) అధినేత్రి మమతా బెనర్జీ, మిత్ర పక్షాల నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాల రూపకల్పన నుంచి శాంతి భద్రతల పరిరక్షణకు, ప్రాంతీయ దురభిమానం నియంత్రణకు ప్రభుత్వ లక్ష్యం మారిందని ఈ ప్రకటన వల్ల విదితమవుతున్నది.
రాజకీయ వ్యవహారాల కమిటీలో ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న మమత, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్ సిపి) అధ్యక్షుడు శరద్ పవార్, డిఎంకె నాయకుడు దయానిధి మారన్ సమైక్య ఆంధ్ర ఆవశ్యకత గురించి మాట్లాడిన తరువాత క్యాబినెట్ కమిటీ సమావేశంలో మొత్తం రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకోవాలనే నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని బెంగాల్ లో గూర్ఖా నేతలు కూడా కోరుతుండడంతో తన మద్దతు సమైక్య ఆంధ్రకేననే సందేశాన్ని మమత స్వరాష్ట్రానికి పంపారు. ప్రత్యేక గూర్ఖాలాండ్ ఏర్పాటును మమత వ్యతిరేకిస్తున్న సంగతి అందరికీ తెలిసినదే. ఇటీవలి ఎన్నికలలో గణనీయ ఫలితాలు సాధించిన అనంతరం స్వరాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలని ఆకాంక్షిస్తున్న తృణమూల్ అధినేత్రి ఇండియా చీలిక పేలికలు కావాలని తాను కోరుకోవడం లేదని చెప్పారు.
Pages: 1 -2- -3- News Posted: 16 December, 2009
|