కొందరికే ఉద్యమాసక్తేల? హైదరాబాద్ : 'రాజకీయ కార్యక్రమాలలో విద్యార్థుల పాత్ర'పై రాష్ట్రంలో ఇటీవల ప్రారంభమైన తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు కొన్ని ప్రశ్నలు లేవనెత్తాయి. ఉదాహరణకు సాంప్రదాయక విశ్వవిద్యాలయాలే రాజకీయ కార్యకలాపాలకు నెలవుగా ఎందుకు మారాయి? సాంకేతిక, ఇతర స్పెషలైజ్డ్ విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఉద్యమాలకు ఎందుకు దూరంగా ఉన్నారనే అంశాలపై ప్రశ్నలు వస్తున్నాయి?
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ఆమరణ నిరాహార దీక్షను నిరోధించేందుకు ఆయనను అరెస్టు చేసినప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులే స్పందించారు. ఆ తరువాత ఈ ఆందోళన పాలమూరు, నల్లగొండ, తెలంగాణ, కాకతీయ విశ్వవిద్యాలయాలు వంటి సాంప్రదాయక విశ్వవిద్యాలయాలకూ విస్తరించింది.
అయితే, హైదరాబాద్ నగరంలోని జెఎన్ టియు - కూకట్ పల్లి, జెఎన్ టియు - మాసబ్ ట్యాంక్, ఇంగ్లీష్, విదేశీ భాషల విశ్వవిద్యాలయం, హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం (హెచ్ సియు), ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, మౌలానా అజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం వంటి ఇతర ప్రధాన విశ్వవిద్యాలయాలు ప్రశాంతంగా ఉండిపోయాయి. ఒకే ప్రాంతంలో ఉన్న వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థుల దృక్పథంలో ఇంతటి తీవ్ర మార్పునకు కారణమేమిటి?
'కారణం సాధారణమైనదే' అని జెఎన్ టియు - కూకట్ పల్లి వైస్ చాన్స్ లర్ (విసి) డి.ఎన్. రెడ్డి చెప్పారు. 'స్పెషలైజ్డ్ విశ్వవిద్యాలయాలతో పోలిస్తే సాంప్రదాయక విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు పరిమితంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. అందువల్ల సాంప్రదాయక విశ్వవిద్యాలయాల (సియుల) విద్యార్థులు కెరీర్ పై దృష్టితో ఉండరు. పైగా రాజకీయాలు, ప్రాంతం, కులం ప్రాతిపదికగా దశాబ్దాలుగా నిర్మితమైన ఈ క్యాంపస్ లలో రాజకీయ పార్టీలకు బలమైన సంస్థాగత పునాదులు ఉంటాయి' అని రెడ్డి పేర్కొన్నారు. 'సాధారణంగా విద్యపైనే దృష్టి ఉన్న విద్యార్థులకు పక్కా ప్రొఫెషనల్ దృక్పథం ఉంటుంది. వారు రాజకీయాలకు దూరంగా ఉంటారు. వారికి గుర్తింపు వారి రంగంలోనే కాని వెలుపల కాదు' అని తిరుచ్చి ఆర్ఇసి మాజీ డీన్, విశాఖపట్నం ఎఎన్ఐటిఎస్ మాజీ డీన్ ప్రొఫెసర్ పి. రామకృష్ణారావు అభిప్రాయం వెలిబుచ్చారు.
Pages: 1 -2- News Posted: 18 December, 2009
|