'వైఎస్ లా పాలించలేను' హైదరాబాద్ : ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు 2009 సంవత్సరం నల్లేరుపై బండిలా సాగలేదు. అసమ్మతివాదులు, వేర్పాటువాదులు వంటి వివిధ శక్తులను అదుపులో పెట్టడానికి ఆయన ప్రయాస పడుతున్నారు. సమస్యలు మరింత తీవ్రమవుతుండగా కొత్త సంవత్సరంలో నిష్కర్షగా వ్యవహరించగలనని రోశయ్య చెబుతున్నారు. అయితే, ఒక విషయంలో రోశయ్య తన మాటను నెగ్గించుకున్నారు. ఐఐఎంలో చదువుకున్న ఐఎఎస్ అధికారి ఎస్.వి. ప్రసాద్ ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తన అభీష్టానుసారం నియమించుకోగలిగారు.
'ఈ పదవిలో నేను కొనసాగడం గురించి నేనేమీ ఆందోళన చెందడం లేదు' ఆని రోశయ్య నూతన సంవత్సరం ఆగమనం సందర్భంగా డక్కన్ క్రానికల్ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 'రాష్ట్ర విభజన కోసం ప్రస్తుతం సాగుతున్న ఉద్యమాన్ని చూసి నేనేమీ విపరీతంగా బాధపడిపోవడం లేదు. నాకు అప్పగించిన బాధ్యతల నిర్వహణను కొనసాగిస్తాను' అని ఆయన తెలిపారు.
సమస్యలు కొనితెచ్చుకోవడం లేదా సంఘర్షణ వైఖరి అవలంబించడం తన తత్వం కాదని ఆ సీనియర్ నేత స్పష్టం చేశారు. 'అయితే, ముఖ్యమంత్రిగా ఎలా వ్యవహరించాలో నాకు తెలుసు. ఈ పదవిలో నేను ఉన్నంత కాలం స్వర్గీయ డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి అజెండాను అమలు పరుస్తాను' అని రోశయ్య చెప్పారు.
వైఎస్ఆర్ అంత కరాఖండిగా తాను వ్యవహరించడం లేదనే విమర్శ ఉందని ఆయన అంగీకరించారు. 'నిజమే. ఆ విమర్శ వచ్చింది' అని ఆయన అన్నారు. 'ఎంఎల్ఎలు, ఎంఎల్ సిలు, చివరకు మంత్రులు కూడా నా నామినీలు కారు. అయినప్పటికీ క్రమశిక్షణను తీసుకురాగలిగాను. నా కన్నా పనులు మెరుగ్గా జరిపించగలమని ఎవరైనా చెప్పినా నేనేమీ బాధపడను. లోటుపాట్లన్నీ నావేనని అంగీకరిస్తాను. ఇందుకు ఇతరులను నిందించను' అని రోశయ్య చెప్పారు.
Pages: 1 -2- -3- News Posted: 1 January, 2010
|