ఎంత కష్టం?ఎంత నష్టం?? హైదరాబాద్ : పదిహేను రోజుల వ్యవధిలో 1800 పైచిలుకు ఆత్మహత్యా యత్నాలు. వాటిలో 72 మరణాలకు దారి తీశాయి. లాఠీచార్జీలు, రాళ్లు రువ్విన సంఘటనలు, గాయాల కారణంగా సంభవించిన మరణాలు, రోడ్లపై అవరోధాల కారణంగా ఆసుపత్రికి వెళుతున్న రోగులు మృతి చెందడం వంటి సంఘటనలు మరో 40 వేలకు పైగా ఉన్నాయి.
నెల రోజులకు పైనుంచి సాగుతున్న తెలంగాణ ఉద్యమం తొలి 15 రోజులకు సంబంధించినవి ఈ గణాంకాలు. అయితే,ఈ ఉద్యమాల కారణంగా సగటు మనిషి చెల్లించుకున్న మూల్యానికి ఇవి ప్రతిబింబాలు కావు. అసలు దానిని అంచనా వేయడం కూడా సాధ్యం కాదు. బస్సులు, రైళ్ళ నిలిపివేత కారణంగా ఆటో చార్జీలు విపరీతంగా పెరిగిపోవడాన్ని, పాలు, కూరగాయల కొరతను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ సగటు మనిషి చెల్లించుకున్న మూల్యం మదింపు వేయడం కష్టం.
నవంబర్ 30 నుంచి నెలకొన్న ఈ సంక్షుభిత పరిస్థితులు అధిక సంఖ్యాకులైన తెలంగాణ ప్రజలు, తెలంగాణలో స్థిరపడిన ఇతర ప్రాంతాలవారి మస్తిష్కాలపై తీవ్ర ప్రభావం చూపినట్లు సైకాలజిస్టులు, సాంఘిక కార్యకర్తలు చెబుతున్నారు. 'బాధ్యతారహితులైన' రాజకీయ పార్టీలు అనాలోచితంగా రేపిన ప్రాంతాల పక్షపాతం- ఇంతకాలం ఇరుగుపొరుగువారిగా స్నేహితులుగా అన్యోన్యంగా, ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా సహజీవనం చేసిన వారిని 'శత్రువులుగా' మార్చివేసిందని వారంటున్నారు.
తన పిల్లల చదువు కోసం చాలా ఏళ్ళ క్రితం పశ్చిమ గోదావరి నుంచి హైదరాబాద్ లో నివసిస్తున్న రైతు, వడ్డీ వ్యాపారి కె. రామచంద్రరావు ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. 'తేలిక షరతులతో రుణాలు ఇచ్చి నేను ఇంతకాలం ప్రోత్సహించి, ఆర్ధికంగా నిలబెట్టిన ఒక పాల వ్యాపారి, కూరగాయల వ్యాపారి ఇప్పుడు నన్ను తమ శత్రువుగా పరిగణిస్తున్నారు' అని రామచంద్రరావు చెప్పారు.
రాయలసీమ, కోస్తా ఆంధ్ర ప్రాంతాల నుంచి వచ్చి తెలంగాణలో చదువుకుంటున్న ఇంజనీరింగ్, వైద్య విద్యార్థులు అనేక మంది తమ భవిష్యత్తు గురించి కలవరపడుతున్నారు. 'పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారుతుందా అనేది, ఇక ఎంత మాత్రం 'స్థానికులం' కాము కనుక మేము ఇక్కడి నుంచి నిష్క్రమించవలసి వస్తుందా అనేది మాకు తెలియదు. మేము ఈ కాలేజీలను ఎందుకు ఇష్టపడ్డామంటే ఇవి కొత్తవి, హైదరాబాద్ కు దగ్గరగా ఉన్నాయనే' అని హైదరాబాద్ పొలిమేరల్లోని చైతన్య భారతి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సిబిఐటి) లో రెండవ సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థిని గాయత్రీ నాయుడు చెప్పింది.
Pages: 1 -2- -3- News Posted: 4 January, 2010
|