జ్ఞాపకశక్తి పెంచే సెల్ ఫోన్! న్యూఢిల్లీ : సెల్ ఫోన్లను సుదీర్ఘ కాలం ఉపయోగించడం వల్ల చుంచెలుకల జ్ఞాపక శక్తి పెరిగి, అల్జైమర్స్ వ్యాధి లక్షణాల నుంచి వాటికి రక్షణ కలిగినట్లు తాజా పరిశోధనలో వెల్లడైంది. ఈ ఫలితాలను కొందరు శాస్త్రవేత్తలు 'అత్యంతాశ్చర్యకరమైనవి'గా అభివర్ణించారు. సెల్ ఫోన్ల నుంచి వెలువడే విద్యుదయస్కాంత తరంగాల హానికర ప్రభావాన్ని పరిశోధించడానికి పూనుకున్న అమెరికా, చైనా, జపాన్ సైంటిస్టులు వాటి వల్ల మెదడుపై రక్షణ ప్రభావాన్ని చూపినట్లు కనుగొన్నారు. సెల్ ఫోన్లు సృష్టించే తరహా విద్యుదయస్కాంత క్షేత్రాల ప్రభావానికి లోను కావడం జ్ఞాపక శక్తిని గణనీయంగా మెరుగుపరచగలదని, అల్జైమర్స్ వ్యాధికి చికిత్సకు అనుసరించదగిన విధానాన్ని ఇది సూచిస్తున్నదని వారంటున్నారు.
అయితే, ఎలుకలపై కానవచ్చిన ప్రభావం మనుషులకు కూడా వర్తిస్తుందా అనేది నిర్థారించడానికి మరింతగా అధ్యయనం జరపవలసిన అగత్యం ఉందని పరిశోధకులు హెచ్చరించారు. 'ఇది పరిశోధన కోసం కొత్త వైజ్ఞానిక రంగానికి అవకాశం కల్పిస్తున్నది. మనుషులలో జ్ఞాపకశక్తిపై దీర్ఘకాలిక విద్యుదయస్కాంత క్షేత్రం ప్రభావం ఎంత మేరకు లాభదాయకమనేది పరిశోధించవలసి ఉంటుంది' అని యుఎస్లో యూనివర్శిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాలో రీసర్చ్ ప్రొఫెసర్, ఈ అధ్యయన బృందం నేత గారీ ఆరెండాష్ అభిప్రాయం వెలిబుచ్చారు. ఈ అధ్యయనం ఫలితాలు 'జర్నల్ ఆఫ్ అల్జైమర్స్ డిసీజ్' జనవరి 7 సంచికలో ప్రచురితమయ్యాయి.
'ఈ (ఎలుక) మోడల్ పక్కా కాదు. కాని అల్జైమర్స్ వ్యాధికి సంబంధించి మా వద్ద ఉన్న అత్యుత్తమ, అత్యంత నిర్థారిత మోడల్స్ లో ఇది ఒకటి' అని ఆరెండాష్ 'ది టెలిగ్రాఫ్' విలేఖరితో చెప్పారు. మనుషులలో ఈ వ్యాధికి సంబంధించిన కీలకమైన వ్యవస్థను ఈ మోడల్ పసిగట్టగలిగింది.
Pages: 1 -2- -3- News Posted: 8 January, 2010
|