సైన్యం 'అలర్ట్' : ఆంటోని శ్రీనగర్ : జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో శాంతి, సుస్థిరతలు గిట్టని శక్తులు మనం గతంలో సాధించిన ప్రయోజనాలను దెబ్బ తీసి, అన్ని విధాల నష్టం కలిగించడానికి ప్రయత్నిస్తాయి కనుక 2010 సంవత్సరం మనకు కీలకం కావచ్చునని రక్షణ శాఖ మంత్రి ఎ.కె. ఆంటోనీ మంగళవారం హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్న భద్రతా సంస్థలు ఉదాసీనతకు తావివ్వరాదని, ఈ ప్రయోజనాల పటిష్ఠతకు పాటుపడాలని మంత్రి కోరారు.
తీవ్రవాదుల చొరబాట్లకు వీలు కల్పించేందుకు పాకిస్తాన్ తిరిగి చేస్తున్న ప్రయత్నాల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేస్తూ, వారి ప్రయత్నాలను అడ్డుకునేందుకు మరింతగా కృషి చేయవలసి ఉంటుందని, ఇంతకుముందు సాధించిన ప్రయోజనాలను ఈ సంవత్సరం పటిష్ఠం చేసుకోవలసి ఉంటుందని అన్నారు.
ఒక రోజు పర్యటనకై జమ్ము వచ్చిన ఆంటోనీ వివిధ భద్రతా దళాల, ఏజెన్సీల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. చొరబాటు యత్నాలు పెరిగినప్పటికీ, వివిధ భద్రతా సంస్థలు చేసిన తీవ్ర కృషి, వాటి మధ్య సమన్వయం, స్థానికుల కృషి ఫలితంగా జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో 'హింసాత్మక సంఘటనల స్థాయి' గణనీయంగా తగ్గిందని ఆంటోనీ చెప్పారు.
రాష్ట్రంలోకి చొరబడడానికి తీవ్రవాదులు పెక్కు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఆంటోనీ ఈ పర్యటన జరిపారు. 'ఈ నెల మొదటి వారంలో కాశ్మీర్ లోయలో జరిగిన సంఘటనలు మున్ముందు పరిణామాలకు సూచికలు' అని కేంద్ర మంత్రి లాల్ చౌక్ దాడిని ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించారు.
Pages: 1 -2- -3- News Posted: 13 January, 2010
|