మురికివాడల్లో కుబేరులు!? ముంబయి : కోట్లకు పడగలెత్తిన అపర కుబేరులే... అర కోటి, కోటి రూపాయలు పెట్టి కార్లు కొనుక్కుని తిరుగుతున్న వారే... కానీ పాపం చాలా మంది బతుకుల్ని మురికివాడల్లో గడుపుతున్నారు. నమ్మలేని ఈ నిజాల్ని చూసి నవీ ముంబయి మున్సిపల్ అధికారులు కళ్ళు తేలేశారు. చాలా మంది ధనవంతులు, కొన్ని కంపెనీలు తమ కార్లను రిజిస్ట్రేషన్ చేయించుకోడానికి సమర్పించిన రికార్డుల్లో పేర్కొన్న చిరునామాలను చూసి అవాక్కయ్యారు. మున్సిపాలిటీకి కట్టాల్సిన కారు సెస్ ను ఎగ్గొట్టటానికే మురికివాడల చిరునామాలు ఇచ్చారని గ్రహించి కళ్ళు తెరిచారు. ఇప్పుడు వారి అసలు చిరునామాలు పట్టి ముక్కుపిండి వడ్డీతో సహా అసలును వసూలు చేయడానికి రంగంలోకి దిగారు.
ముంబయిలో కారు రిజిస్ట్రేషన్ చేయిస్తే దాని ఖరీదులో 5.5 శాతాన్ని మున్సిపల్ కార్పోరేషన్ కు సెస్ గా చెల్లించాల్సి ఉంటుంది. అదే థానే, నవీ ముంబయిలో చేయిస్తే కేవలం ఒక శాతంతో సరిపెట్టేయవచ్చు. దాంతో ముంబయి ప్రముఖులంతా తమ కార్లను నవీ ముంబయి ఆర్టీవో కార్యాలయంలోనే తమ ఖరీదైన, విలాసవంతమైన కార్లను రిజిస్టర్ చేయించారు. కానీ మున్సిపాలిటీకి చెల్లించాల్సిన సెస్ ను మాత్రం ఎగ్గొట్టారు. ఆర్టీవో కార్యాలయంలో రికార్డులు పరిశీలించిన మున్సిపల్ అధికారులు నిజాల్ని చూసి నిశ్చేష్టులయ్యారు. ఈ సెస్ చెల్లించని వారిలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కరే కాదు రిలయన్స్ యజమాని అనీల్ అంబానీ ఉన్నారు. ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్, రాజకీయ ప్రముఖుడు డివై పాటిల్ తో పాటు దేశ ప్రజలందరికీ తెలిసిన మరో 25 మంది ప్రముఖులు సెస్ ఎగవేతదారుల జాబితాలో ఉన్నారు. దాంతో ఇప్పుడు నవీ ముంబయి అధికారులు అర కోటి రూపాయలుగా పైగా పెట్టి కారులు కొన్న దాదాపు 24 వేల మందికి సెస్ బాకీని వడ్డీతో సహా కట్టమని తాఖీదులు పంపించారు.
Pages: 1 -2- -3- News Posted: 25 January, 2010
|