హైదరాబాద్ : రాక్షసత్వం చిన్నారిని అమానుషంగా బలి తీసుకుంది. ఏ పాపం తెలియని పసిమొగ్గను నులిమేసింది..చిరునవ్వులు చిందించే పాపను బూడిదగా మార్చింది..అంతటితో ఆగక ఓ కుటుంబానికి పెద్ద దిక్కును పొట్టన పెట్టుకుంది. బంధుగణానికే కాదు హృదయమున్న ప్రతీ మనిషికీ తీరని శోకాన్ని మిగిల్చింది.. రాష్ట్రం కన్నీటి తడితో ఈ విషాదాన్ని చూసింది పగతో ప్రతీకారానికి మూడు రోజుల వ్యవధిలో మూడు ప్రాణాలు గాలిలో కలిసాయి. అవి రెండు హత్యలు ఒక హఠాన్మారణం.
ఆ రోజు జనవరి 30 శనివారం... విజయవాడలో వ్యాపార వేత్త ముద్దుల కూతురు వైష్ణవి. చదువుల తల్లి ఒడిలో పాఠాలు నేర్చుకునేందుకు తన అన్న సాయి తేజేష్ తో పాటు ముస్తాబయింది. తల్లితండ్రలకు బై బై చెప్పి కారులో చిన్నారులిద్దరూ స్కూలుకు బయలుదేరారు. స్కూలుకు బయలుదేరిన చిన్నారులు అక్కడకి చేరనే లేదు. మార్గ మధ్యంలోనే మాయమయ్యారు. స్కూలుకు వెళ్లే దారిలో కొందరు దుండగులు అడ్డగించి దాడి చేసి..ఆపై కారు డ్రైవర్ ను హత్య చేసారు. దుండగుల నుండి సాయితేజేష్ తప్పించుకున్నాడు. చిన్నారి వైష్ణవి మాత్రం ఆ క్రూరులకు చిక్కింది. ముందస్తు పథకం ప్రకారం వారు వైష్ణవిని ఎత్తుకెళ్లారు. ఈ వార్త దావానంలా రాష్ట్రమంతటా వ్యాపించింది. విజయవాడ అంతటా కలకలం చెలరేగింది. తన ఎంతో ప్రియమైన కుమార్తె వైష్ణవి కిడ్నాప్ నకు గురైందని తెలుసుకుని ఆమె కుటంబం తల్లిడిల్లింది. ఏ క్షణమైన ఆ చిరు నవ్వుల చిన్నారి తిరిగొస్తుందని కాళ్లు కాయలు కాసేలా ఆశతో రాత్రింబవళ్ల నిరీక్షణ సాగించారు.