అధికారుల చేతుల్లో మంత్రులు న్యూఢిల్లీ : కేంద్ర మంత్రులకు అధికారులంటే హడలు పట్టుకుంది. ఎందుకంటే ఈ మంత్రులు ఎలా పని చేస్తున్నారో, గడచిన సంవత్సరంలో వారి పని తీరు ఎలా ఉందో మదింపు వేసి ప్రధానికి నివేదికలు ఇవ్వబోతున్నారు కాబట్టి. ఈ మంత్రులు క్రితం సంవత్సరం చివర్లో పనితీరు సమీక్ష పత్రంపై సంతకాలు చేశారు. ఆ సమీక్ష ఏవిధంగా ఉంటుందో ఇప్పుడిప్పుడే వారికి అవగతం అవుతోంది. పాలనను మెరుగుపరచాలన్న ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ లక్ష్యంతో తమకేమీ సమస్య లేదని మంత్రులు చెబుతున్నప్పటికీ తమ పని తీరును కొందరు ఉన్నతాధికారులు మదింపువేస్తారని తెలిసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. 'మేము ఇప్పుడు క్యాబినెట్ సెక్రటేరియట్లోని బాబులు (ఉన్నతాధికారులు) దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉన్నాం. వారు అమెరికా నుంచి మేనేజ్ మెంట్ సూత్రాలను నేర్చుకున్న తరువాత ఈ విధానాన్ని రూపొందించారు' అని మంత్రి ఒకరు చెప్పారు. జవాబుదారీతనం కోసం చేస్తున్న కృషి ప్రజా నాయకులలో ఎటువంటి అపనమ్మకాన్ని కలిగిస్తుందో ఆయన వ్యాఖ్య సూచిస్తున్నది.
తాము సంతకాలు చేసినట్లుగా మంత్రులు చెబుతున్న 'అవగాహన పత్రం' (ఎంఒయు) వాస్తవానికి 'ఫలితాల సమీక్ష పత్రం' (ఆర్ఎఫ్ డి)గా పేర్కొంటున్నారు. క్యాబినెట్ సెక్రటేరియట్ కింద ఏర్పాటు చేసిన 'కార్యకలాపాల నిర్వహణ డివిజన్' (పిఎండి) దీనికి రూపకల్పన చేసింది. క్యాబినెట్ సెక్రటేరియట్ సమాచారం ప్రకారం, 'ప్రజల తీర్పునకు ప్రాతినిధ్యం వహించే మంత్రికి, సదరు తీర్పు అమలుకు బాధ్యత వహించే శాఖ కార్యదర్శికి మధ్య అవగాహన పత్రమే ఆర్ఎఫ్ డి'. అంగీకృత ఆశయాలు, విధానాలు, కార్యక్రమాలను మాత్రమే కాకుండా అమలులో సాధించిన విజయానికి సూచికలు, లక్ష్యాలను కూడా ఈ పత్రంలో పొందుపరుస్తారు. దీని వల్ల పురోగతిని మదింపు వేయవచ్చు. ఇందుకు వేసే మార్కుల శాతం ఇలా ఉంటుంది: అత్యద్భుతం (ఎక్సలెంట్) 100, చాలా బాగుంది (వెరీ గుడ్) 90, బాగుంది (గుడ్) 80, ఫర్వాలేదు (ఫెయిర్) 70, నాసి (పూర్) 60. అరవై శాతం లోపు పని తీరుకు మంత్రిత్వశాఖకు సున్నా స్కోరు వస్తుంది.
Pages: 1 -2- -3- News Posted: 2 February, 2010
|