'ద్వంద్వ' ఆరాటం వాషింగ్టన్ : కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ అసాధ్యాన్ని సాధ్యం చేసింది. భారత సంతతి అమెరికన్లకు స్వదేశాన్ని రాత్రికి రాత్రే ఆకర్షణీయంగా ఈ శాఖ మార్చివేసింది. భారత పౌరసత్వం కోసం వారు అధిక సంఖ్యలో బారులు తీరుతున్నారు. విదేశాలలోని భారతీయులకు పౌరసత్వం (ఒసిఐ) కోసం అభ్యర్థనలు ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. మామూలుగా ద్వంద్వ పౌరసత్వంగా పేర్కొనే ఈ పౌరసత్వం కోసం అభ్యర్థనలు అమెరికాలో ఒక కాన్సులర్ కేంద్రంలో 1600 శాతం మేర పెరిగాయి. ద్వంద్వ పౌరసత్వం కోసం విజ్ఞప్తులు కుప్పతెప్పలుగా వస్తున్నాయని యుఎస్ లోని ఇతర కాన్సులర్ కేంద్రాలు కూడా తెలియజేశాయి. పరిమితంగా కాన్సులర్ సిబ్బంది ఉన్న భారత దౌత్య కార్యాలయాలకు ఈ రద్దీని తట్టుకోవడం కష్టంగా మారింది.
బర్త్ సర్టిఫికెట్లు, ఇతర పత్రాల కాపీలను కోరాలని భారత ప్రభుత్వం అవివేకంగా తీసుకున్న నిర్ణయం ఫలితమే ఈ రద్దీ. యుఎస్ లో భారతీయ వీసాల కోసం దరఖాస్తు చేసేవారికి పత్రాలను సంపాదించడం కష్టం. డేవిడ్ హెడ్లీ వీసా వివాదం నేపథ్యంలో భారత ప్రభుత్వం హడావుడిగా తీసుకుంటున్న చర్యలలో భాగమే వీసా దరఖాస్తులకు బర్త్ సర్టిఫికెట్లను జత చేయాలని కోరడం. దీనితో విదేశాంగ శాఖ సహాయ మంత్రి శశి థరూర్ ఈ దారుణ చర్యలలో విజ్ఞతను ప్రశ్నించవలసి వచ్చింది.
అమెరికాలో భారతీయ వీసాల జారీ విషయంలో సంక్షోభానికి దారి తీస్తున్న ఈ సమస్య పరిష్కారానికై అమెరికాలోని భారత రాయబారి, డిప్యూటీ రాయబారి, భారతీయ కాన్సుల్ జనరల్ లు, వీసా ప్రక్రియతో సంబంధం ఉన్న పలువురు ఇతర అధికారులు క్రితం వారాంతంలో శాన్ ఫ్రాన్సిస్కోలో సమావేశమయ్యారు. వాస్తవానికి అమెరికాలోని భారత రాయబార కార్యాలయం, కాన్సులేట్లు ఎప్పటికప్పుడు నిర్వహించే ప్రక్రియలో భాగంగా ఈ సమావేశాన్ని తలపెట్టినప్పటికీ వీసా సమస్యపై శాన్ ఫ్రాన్సిస్కో సమావేశంలో ఎక్కువ సేపే చర్చించినట్లు అధికారులు తెలియజేశారు. అయితే, అంతకంతకు శక్తిమంతం అవుతున్న కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖకు కోపం తెప్పించవచ్చుననే భయంతో ఈ విషయాలు వెల్లడి చేయరాదనే ఆదేశాలు వారికి ఉన్నాయి.
Pages: 1 -2- -3- News Posted: 12 February, 2010
|