మమతను ఏడిపించిన ప్రణబ్ న్యూఢిల్లీ : రైల్వే శాఖ మంత్రి మమతా బెనర్జీ చివరి క్షణంలో సమర్పించిన రూ. 15 వేల కోట్లు విలువ చేసే 24 రైల్వే ప్రాజెక్టులకు మౌలిక వసతుల క్యాబినెట్ కమిటీ (సిసిఐ) ఆమోదం తెలిపింది. 2010 - 11 రైల్వే బడ్జెట్ సమర్పణకు ఆరు రోజుల ముందు మమతా బెనర్జీ గురువారం తన మంత్రివర్గ సహచరులను ఆశ్చర్యానికి గురి చేస్తూ రూ. 15 వేల కోట్లకు పైగా విలువ చేసే 24 ప్రాజెక్టులను ఆమోదం కోసం సిసిఐకి సమర్పించారు. చివరకు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ అయిష్టంగానే ఎటువంటి ఆర్థిక సహాయమూ లేకుండా ఈ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. అయితే, రైల్వే మంత్రి వ్యవహార సరళిని ఆక్షేపిస్తున్న రీతిలో ప్రసంగించిన తరువాతే వీటికి వారు ఆమోదముద్ర వేశారు.
గురువారం సిసిఐ సమావేశంలో భావోద్రేకాలు ఎంతగా వ్యక్తమయ్యాయంటే ప్రణబ్ ముఖర్జీ ఆగ్రహపూరిత స్వరంతో మమతను ఉద్దేశించి మాట్లాడుతూ, 'బెంగాల్, దేశంలోని ఇతర ప్రాంతాల అభివృద్ధికి ఉద్దేశించిన ప్రాజెక్టులను నేను ఆమోదించలేదని మీరు బయటకు వెళ్లి పత్రికలవారితో చెబుతారని నాకు తెలుసు. కాని, నేను మీకు అందుకు అవకాశం ఇవ్వను. ఇప్పటికిప్పుడే ఈ ప్రాజెక్టులన్నిటినీ ఆమోదిస్తున్నాను' అని తెలియజేశారు.
వాస్తవానికి మమతా బెనర్జీ ఈ ప్రతిపాదనలను బుధవారం అర్ధరాత్రి సమయంలో క్యాబినెట్ కార్యదర్శి కె.ఎం. చంద్రశేఖర్ కు పంపి, మరునాటి సమావేశపు అజెండాలో వీటిని చేర్చాలని విజ్ఞప్తి చేసినట్లు అభిజ్ఞ వర్గాల ద్వారా తెలుస్తున్నది. ముఖర్జీ కరాఖండీగా మాట్లాడడంతో నొచ్చుకున్న మమత కన్నీళ్ల పర్యంతమయ్యారు. గృహవసతి, పట్టణ పేదరిక నిర్మూలన, టూరిజం శాఖ మంత్రి కుమారి సెల్జా లేచి ఆమెను ఓదార్చారు. మరొక మంత్రి విలాస్ రావు దేశ్ ముఖ్ ఆమెకు తన కర్చీఫ్ ను అందజేయడం కనిపించింది.
అయితే, ముఖర్జీ ఏమాత్రం పట్టించుకోలేదు. తాను ఈ ప్రాజెక్టులను ఆమోదిస్తున్నానని, కాని, ఆర్థికపరంగా ఎటువంటి వాగ్దానమూ చేయడం లేదని ఆయన ప్రకటించారు. 'మీరు వెళ్లి, మీ బడ్జెట్ లో వీటి గురించి ప్రకటన చేయండి. అయితే, ఈ ప్రాజెక్టులను మీరు అమలు చేయాలని అభిలషిస్తే మీరు సొంతంగా నిధులు సమీకరించుకోవలసి ఉంటుంది' అని ఆమెకు ముఖర్జీ స్పష్టం చేశారు.
Pages: 1 -2- -3- News Posted: 20 February, 2010
|