అమీర్ ఏడాది రెస్ట్
ఏడాది పొడవునా బిజీ షెడ్యూల్స్ తో సతమతమయ్యే హీరోలు ఏదో ఒక సమయంలో కొద్దిపాటి విశ్రాంతి తీసుకుని మళ్లీ కొత్త ఉత్సాహం పుంజుకుంటారు. అయితే స్టార్ ఖాన్ అమీర్ మాత్రం కొద్దికాలంగా ఎడతెరపి లేని షెడ్యూల్స్ కారణంగా విశ్రాంతికి నోచుకోవడం లేదు. 'గజనీ' చిత్రం సంచలన విజయం సాధించిన అనంతరం ఆయన ఇప్పుడు పూర్తి రిలాక్స్ ను కోరుకుంటున్నట్టు సమాచారం. ఏడాది పాటు నటనకు
బ్రేక్ ఇవ్వాలనే ఆలోచనలో అమీర్ ఉన్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నారు. అమీర్ ఒక్కో సినిమాకి 30 కోట్ల రెమ్యునరేషన్ కానీ, లాభాల్లో 33 శాతం వాటాు గానీ తీసుకుంటున్నారు.
'అమీర్ ఏడాది పాటు విశ్రాంతి తీసుకోవాలని అనుకోవడం నూటికి నూరుపాళ్ల నిజం' అని ఆయన సన్నిహితులు తెలిపారు. ప్రస్తుతం రాజ్ కుమార్ హిరానీ తీస్తున్న '3 ఇడియట్స్' సినిమా పూర్తి కాగానే ఆయన తన ప్లానింగ్ ను అమలు చేస్తారని వారు పేర్కొన్నారు. నిజానికి గత ఏడాది ఆయన నటిస్తూ దర్శకత్వం వహించిన 'తారే జమీన్ పర్' చిత్రం తర్వాత విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నారనీ, అయితే అప్పటికే 'గజనీ' చిత్రానికి కమిట్ అయినందున ఆ పాత్రకు తగిన ఆహార్యం కోసం కఠోరమైన ఎక్సర్ సైజులు చేసి అహోరాత్రులు కష్టపడ్డారనీ, ఇందుకోసం సరైన విశ్రాంతికి కూడా నోచుకోలేదనీ తెలిపారు. 'సరైన బ్రేక్ తీసుకునేందుకు ఇప్పుడు సమయం చిక్కింది. మరో ఏడాది పాటు ఏ సినిమా కూడా చేసే అవకాశం లేదు' అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అమీర్ తన విశ్రాంతి సమయాన్ని కథలు వినడం, సినిమాలు చూడటం, పిల్లలతో సమయం గడపడం వంటి వాటికి కేటాయించవచ్చనీ, అయినప్పటికీ సొంత నిర్మాణ సంస్థ పనులకు ఎలాంటి అవాంతారాలు ఉండకపోవచ్చనీ వారంటున్నారు.
News Posted: 9 February, 2009
|