దత్ కపుల్ కు కంగ్రాట్స్
సంజయ్ దత్, మన్యత దంపతులు గత ఏడాది ఫ్రిబవరి 11న తమ వివాహాన్ని బంధువులు, కొద్దిపాటి సన్నిహితుల మధ్య ప్రైవేట్ వ్యవహారంగానే జరుపుకొన్నారు. అయితే ఈ ఏడాది తమ తొలి వివాహ వార్షికోత్సవానికి అందర్నీ ఆహ్వానించి ఘనంగా నిర్వహించేందుకు దత్ దంపతులు సర్వ సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం రాత్రి నుంచే తమ పాలి హిల్స్ రెసిడెన్సీలో ఘనంగా పార్టీ ఏర్పాట్లు చేస్తున్నారు..
దత్ జీవితంలోకి మాన్యత అడుగుపెట్టిన తర్వాతే ఆయనకు స్థిరత్వం వచ్చిందనీ, ఇప్పుడు పలు సినిమాలు చేతిలో ఉండటంతో పాటు రాజకీయాల్లోకి కూడా అడుగుపెడుతున్నారనీ, సంజూ దంపతులు తమ ఆనందాన్ని పంచుకోవడానికి ఇంతకన్నా మంచి సందర్భం మరొకటి ఉండదని దత్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. దత్ దంపతుల వెడ్డింగ్ సెర్మనీ పార్టీ కోసం అతిథుల జాబితా కూడా ముందుగానే రెడీ చేశారు జాన్ అబ్రహం, బిపాసాబసు, అజయ్ దేవగణ్ - కాజోల్, బంటీ వాలియా, జావెద్ ఖాన్ -మల్లిక వంటి ప్రముఖులెందరో ఈ జాబితాలో ఉన్నారనీ, గెస్ట్ ల జాబితా, పార్టీలో ఉండాల్సిన మెనూ విషయంలో మాన్యత ప్రత్రేక శ్రద్ధ చూపుతున్నారనీ, రాత్రి ప్రారంభమయ్యే పార్టీ 11వ తేదీ తెల్లవారు జాము వరకూ జరుగుతుందనీ ఆ వర్గాలు తెలిపాయి. అమర్ సింగ్, శత్రుఘ్నుసిన్హా వంటి ప్రముఖులు సైతం ఈ పార్టీకి హాజరకానున్నారు. తొలి వివాహ వార్షికోత్సవంలో భాగంగా సంజూ దంపతులు పార్టీ ఇస్తున్న విషయాన్ని ఆయన బిజినెస్ మేనేజర్ ధరమ్ ఒబెరాయ్ ధ్రువీకరించారు. 'సంజూ దంపతులు తమ ఇంటికి వివాహ వార్షికోత్సవ కళను తీసుకురాబోతున్నారు' అని ఆయన తెలిపారు. గత ఏడాది ఫిబ్రవరి 11న హిందూ సంప్రదాయం ప్రకారం మాన్యత మెడలో సంజూ మూడుముళ్లు వేశారనీ, వెర్సోవాలో మాన్యత ఫ్రెండ్ ప్రదీప్ నివాసంలో ఈ కార్యక్రమం జరిగిందనీ, పరిశ్రమకు చెందిన ఎంపిక చేసిన వ్యక్తులు మాత్రమే హాజరయ్యారనీ తెలిపారు. అందుకు భిన్నంగా తొలి వివాహ వార్షికోత్సవాన్ని బంధువులు, హితులు, పరిశ్రమ ప్రముఖుల మధ్య దత్ దంపతులు ఉల్లాసంగా జరుపుకోనున్నట్టు ఆయన వివరించారు.
News Posted: 10 February, 2009
|