అమీర్ ను నిలదీస్తా:షారూక్
'ఈ బాధ భరించలేకుండా ఉన్నాను. భరించలేనంత నొప్పి' అని తన భుజానికి తగిలిన గాయంతో షారూక్ ఖాన్ విలవిలలాడిపోతున్నారు. నొప్పితగ్గడానికి స్టెరాయిడ్స్ వాడుతున్నప్పటికీ పరిస్థితి మరింత క్షీణిస్తోందనీ, మరో నాలుగైదు రోజుల్లో సర్జరీకి సిద్ధమవుతున్న కొద్దీ బాధ మరింత ఎక్కువవుతోందనీ, ఎలా తట్టుకోవాలో అర్ధం కావడం లేదనీ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత బాధలోనూ ఆయన నిబ్బరంగానే కనిపిస్తున్నారు. అయితే సంభాషణల మధ్యలో ఒకింత సేపు బలంగా ఊపిరి తీసుకుంటున్నారు. నానావతి ఆసుపత్రిలో ఈనెల 16న షారూక్ భుజానికి సర్జరీ జరగనుంది.
షారూక్ కు భుజం గాయంతో పాటు ఆయనను బాధించే అంశాలు కూడా లేకపోలేదు. ఆమధ్య ఓ సందర్భంలో షారూక్ తనను తాను నెంబర్ వన్ గా అభివర్ణించుకోవడాన్ని అమీర్ ఖాన్ హరిహసించారు. షారూక్ పరోక్షంలో జరిగిన వ్యవహారమిది. 'అమీర్ తో గొడవ పడతాను. అలా ఎందుకు అన్నావని అడుగుతాను.నిజానికి చాలా విషయాల్లో నేను సర్దుకుపోతుంటాను. అయితే ఇది ఆషామాషీ వ్యవహారం కాదని నా అభిప్రాయం. నేను నెంబర్ వన్ అని చెప్పానంటే గొప్పలు చెప్పుకోవడం కోసం కాదు. కొద్దిపాటి హ్యూమర్, హుందాతనం జోడించి అలా చెప్పాను. ఆ విషయం అమీర్ కు అర్ధం కాకపోయి ఉండవచ్చు' అని అమీర్ నవ్వుతూ చెప్పారు. తన కుక్క పేరు అమీర్ అంటూ షారూక్ అభివర్ణించిన విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు కింగ్ ఖాన్ మళ్లీ సీరియస్ గా మారారు. 'నా కుక్కు పేరు అమీర్ అంటూ నేను జోక్స్ కట్ చేయడం పట్ల నా భార్య గౌరి మనస్థాపం చెందింది. అలాంటి పనులు చేసి తల దించుకోవవడం ఎందుకని ఆమె ప్రశ్నించింది. ఆమె వాదనను నేను గౌరవిస్తున్నాను. నా డిగ్నిటీ తగ్గకూడదని ఆమె కోరుకోవడాన్ని నేను అర్ధం చేసుకోగలను. అయితే ఒక్కోసారి జనం ఒక్కోసారి అడిగినప్పుడు అలా మాట్లాడటం అనివార్యమవుతుంటుది' అని షారూక్ వివరణ ఇచ్చారు. 'రబ్ నే బనాదే' రిలీజ్ సమయంలో 'గజనీ' ప్రమోషన్ చేసుకోవడంపై ఆగ్రహంగా ఉన్నారా అని అడిగినప్పుడు, అలాంటిదేమీ లేదనీ, తాను ఆ సినిమాకు నిర్మాతను కూడా కాదనీ షారూక్ సమాధానమిచ్చారు. తాను కూడా బహుశా ఇలాంటి మార్కెటింగ్ ట్రిక్ నే చేయవచ్చనీ, 'బిల్లూ బార్బర్' విషయంలో మరింత బెటర్ ప్లానింగ్ చేపట్టనున్నామనీ తెలిపారు. ఆ చిత్రంలో తాను సూపర్ స్టార్ గా నటిస్తున్నాననీ, అయితే 'ఓం శాంతి ఓం'లో చేసిన పాత్ర కంటే చాలా డిఫరెంట్ గా ఇందులో తన పాత్ర ఉంటుందనీ చెప్పారు. సూపర్ స్టార్ డమ్ లో చిక్కుకున్నప్పటికీ చాలా సాదాసీదదాగా ఇందులో కనిపిస్తుంటానని చెప్పారు. అంటే ఇప్పుడు కనిపిస్తున్న షారూక్ మాదిరిగా అనుకోవచ్చా? ఇందుకు షారూక్ సమాధానం చిరునవ్వే...
News Posted: 10 February, 2009
|