'వీర్'కు హైకోర్టు బ్రేక్
జైపూర్: చారిత్రాత్మక అమెర్ ఫోర్ట్ లో జరుగుతున్న సల్మాన్ ఖాన్ 'వీర్' చిత్రం షూటింగ్ ను నిలిపివేయాలని రాజస్ధాన్ హైకోర్టు శుక్రవారంనాడు ఆదేశించింది. గురువారంనాడు షూటింగ్ సందర్భంగా గోడ కూలిపోయి పలువురు గాయపడ్డారు. దీంతో చారిత్రక కట్టడాన్ని పరిరక్షించడంలో భాగంగా యూనిట్ సభ్యులు వెంటనే ఆ ప్లేస్ ను ఖాలీ చేయాలని కోర్టు స్పష్టంచేసింది. జస్టిస్ అశోక్ పరిహార్, జస్టిస్ జి.ఎస్.సర్రఫ్ లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ ఆదేశాలు జారీచేస్తూ చారిత్రక కట్టడాలను పరిరక్షించడానికి కట్టుదిట్టమైన నిబంధనలు పాటించాలనే మర్గదర్శక సూత్రాలను ఈ కేసులో ఎందురు ఉల్లంఘించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు కూడా పంపింది..
డబ్బు, దురాస, అధికార వ్యామోహం వంటివి మనిషిని నీచత్వానికి దిగజారుస్తున్నాయనీ, ప్రభుత్వం, అధికారులు ఇలాటి విధానాలను పాల్పడితే అంతటా అలజడి మొదలవుతుందనీ, జైపూర్ లోని అమెర్ ప్యాలస్ లో జరిగిన సంఘటన ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా అనుకోవాల్సి వస్తోందనీ కోర్టు అభిప్రాయపడింది. సల్మన్ ఖాన్ తో పాటు ఈ చిత్రంలో రాష్ట్ర టూరిజం మంత్రి బినా కక్ కూడా నటిస్తుండటం విశేషం. బుధవారంనాడు షూటింగ్ సందర్భంగా కోటలోని ఒక గోడ కూలిపోయి ఇద్దరు కెమెరామన్లతో సహా షూటింగ్ చూసేందుకు వచ్చిన 15 మంది జనం గాయపడటాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. అక్కడ టూరిస్టులు ఫోటోలు, వీడియో షూటింగ్ తీసుకోకుండా నిబంధనలు అమలులో ఉన్నాయనీ, అలాంటప్పుడు ఆ క్లాంప్లెక్స్ లో భారీ సెట్ నిర్మించుకునేందుకు, షూటింగ్ కు ఎలా అనుమతించారో పూర్తి నివేదక ఇవ్వాలని కూడా డివిజన్ బెంచ్ ఆదేశించారు. 'భారీ సెట్ నిర్మాణం కోసం అమెర్ ఫోర్ట్ ప్రవేశద్వారం, ప్యాలస్, టెంపుల్ రూపురేఖలు మరిపోయి ఉండొచ్చు. చెట్లు, ఫౌంటైన్లు నేలకూల్చి ఉండొచ్చు. ప్రజల ఆస్తులను, వారు గాయపడడానికి కారకులైన అధికారుల నుంచి, నిర్మాతల నుంచి తగిన నష్టపరిహారం ఎందుకు వసూలు చేయకూదదో కూడా వివరణ ఇవ్వాలి' అని కోర్టు స్పష్టం చేసింది. డవలప్ మెంట్ పేరుతో కట్టడాలు, వాటి ఔన్నత్యాన్ని దెబ్బతీస్తున్నారనీ, చరత్ర, శిల్పకలానైపుణ్యం గురించి కనీస పరిజ్ఞానం ఉండటం లేదనీ, భారీ నిధులు వసూలు చేసి కొందరు జేబులు కూడా నింపుకుంటున్నారనీ కోర్టు తప్పుపట్టింది. చారిత్రక కట్టడాల పరిరక్షణ కూడా ఇటీవల కాలంలో డబ్బు రాబడికి మార్గమవుతోందని కోర్టు అభిప్రాయపడింది. ఫోర్ట్ లో 'వీర్' చిత్రం షూటింగ్ విషయంలో ఇంతకుముందే ఓ వివాదం తలెత్తింది. ఇక్కడ షూటింగ్ జరపడం కట్టడాల పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించడం కిందకే వస్తుందని రాజేంద్ర సింగ్ అనే వ్యక్తి సవాలు చేశారు. అయితే కట్టడానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని నిర్మాతల ఇచ్చిన హామీతో అక్కడ షూటింగ్ కు ఫోర్టు అధికారులు అనుమతి ఇచ్చారు. 'వీర్ ' చిత్రాన్ని అనిల్ శర్మ దర్శకత్వంలో విజయ్ గిలానీ నిర్మిస్తున్నారు.
News Posted: 13 February, 2009
|