'బిల్లూ' సాంగ్ కలకలం
ముంబై : షారూక్ ఖాన్ 'బిల్లూ' చిత్రంలోని ఓ పాట విషయంలో తలెత్తిన అపోహలు బాంద్రాలోని ఓ థియేటర్ వద్ద శుక్రవారంనాడు ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. నిరసన ప్రదర్శకులకు ఖాన్ స్వయంగా లండన్ నుంచి వివరణ ఇచ్చి అనుమాన నివృత్తి చేయడంతో పరిస్థితి చక్కబడింది.
గైటీ సినిమా క్లాంప్ల్ క్స్ వద్దకు మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో 15 మందికి పైగా ప్రదర్శకులు చేరుకుని పోస్టర్లు చించివేస్తూ, ప్రేక్షకులను థియేటర్ లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. 'రబ్ కే హుజూర్ మై నిబాయ్, ప్యార్ కి...' (నిన్ను ప్రేమిస్తున్నానని దేవుడి సమక్షంలో వాగ్దానం చేస్తున్నాను) పాట తమ మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ వారు ఆందోళవ వ్యక్తం చేశారు. ప్రోఫెట్ ను హుజూర్ గా ముస్లింలు అభివర్ణిస్తారు. థియేటర్ పై రాళ్లు రువ్వి అద్దాలు బద్దలు కొట్టడంతో షారూక్ లండన్ నుంచి ఫోను చేసి వారిని శాంతిపజేశారు. దీనిపై థియేటర్ యజమాని మనోజ్ దేశాయ్ వివరణ ఇస్తూ, ముస్లిం మతపెద్దలకు స్థానిక మసీదులో ఈ పాటను ప్రదర్శించి చూపామనీ, ఆ పాట ఎవరినీ కించపరచేలా లేదని వారు కూడా అంగీకరించారనీ అన్నారు. అయితే ఆ తర్వాత క్రమంలో 'రబ్ కే హుజూర్ ...' (దైవదూత మహమ్మద్ ప్రేమ వాగ్దానం చేసినట్టు అర్ధం) పాటను కొందరు తప్పుగా అర్ధం చేసుకుని ఆందోళనకు దిగారనీ ఆయన చెప్పారు. ఈ సంఘటన సినిమాకి కావలసినంత పబ్లిసిటీ తెప్పించే క్రమంలో భాగం కావచ్చని కొందరు ఊహాగానాలు చేస్తున్న వారు కూడా ఉన్నారు. కొద్ది రోజుల క్రితమే టైటిల్ పై అభ్యంతరాలు ఏర్పడడంతో అందులోని 'బార్బర్ ' పదాన్ని తొలగించి 'బిల్లూ' పేరుతో సినిమా రిలీజ్ చేశారు. పబ్లిసిటీలో భాగంగానే ఈ ఆందోళన తలెత్తిందా అనే విషయాన్ని విచారణ చేస్తామనీ, పాటపై తలెత్తిన అపోహలు తొలగిపోయాయనీ బాంద్రా పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్ స్పెక్టర్ ప్రకాష్ జార్జి తెలిపారు.
News Posted: 14 February, 2009
|