మళ్లీ తెరపైకి రజనీ 'బాషా'
మీరు రజనీకాంత్ వీరాభిమానా? అయితే రజనీ, శంకర్ కాంబినేషన్ లో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న 'యంతిరిన్' కోసం ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉండొచ్చు. ఆ సినిమా కోసం మరింత నిరీక్షణ కూడా తప్పదు. ఈలోగా రజనీ అభిమానులకు ఊరట కలిగించి ఉత్సాహ పరిచేందుకు 1996లో సూపర్ డూపర్ హిట్టయి, రాజకీయ వర్గాల్లో గుబులు రేపిన రజనీ 'బాషా' చిత్రం మరోసారి థియేటర్లను పలుకరించబోతోంది.
రజనీకాంత్, నగ్మా, రఘువరన్, జనక్ రాజ్ ప్రధాన పాత్రల్లో సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్.ఎం.వీరప్పన్ నిర్మించారు. రజనీకాంత్ కెరీర్ లోనే అత్యుత్తమ నటన ప్రదర్శించిన చిత్రాల్లో ఇది ఒకటిగా నిలుస్తుంది. ఇందులో రఘువరన్ ప్రదర్శించిన నటన నేటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. కొన్నేళ్ల క్రితం సంచలనం సృష్టించిన ఈ చిత్రం మరోసారి ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేయడం ఖాయమని ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తున్న ఓకె ఫిలిమ్స్ ప్రతినిధులు చెబుతున్నారు. ఈనెల 27న సినిమా రీ-రిలీజ్ కు సన్నాహాలు చేస్తుండటంతో రజనీ అభిమానులు సైతం సంబరాలకు సిద్ధపడుతున్నారు. రజనీ ఎప్పుడు వచ్చినా, ఏ రూపంలో వచ్చినా తమ సంబరాలు మిన్నుముడతాయని అభిమానులు అంటున్నారు. 'యంతిరిన్'కు ముందుగా 'బాషా' వస్తుండటం వారి ఉత్సాహాన్ని ద్విగుణీకృతం చేస్తోంది. 'యంతిరిన్' చిత్రాన్ని ఇండియన్ సినీ చరిత్రలోనే తొలిసారిగా 165 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రజనీ ద్విపాత్రాభినయం చేస్తుండగా, ఆయన జోడిగా తొలిసారి ఐశ్వర్యారాయ్ నటిస్తోంది.
News Posted: 17 February, 2009
|