సురేష్ బాబుతో వర్మ టైయప్
రామ్ గోపాల్ వర్మ తీస్తున్న ఒక్కో సినిమా బాక్సాఫీస్ వద్ద పేలిపోతుండటంతో బాలీవుడ్ నుంచి ఆయనకు సరైన సపోర్ట్ దొరకని పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్లిష్ట పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు ఆయన టాలీవుడ్ వైపే ఆశగా చూస్తున్నారనీ, తన తాజా చిత్రమైన 'రణ్ ' కోసం చిరకాల మిత్రుడు, ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు సహకారాన్ని ఆయన ఆశిస్తున్నారనీ విశ్వసనీయ వర్గాల సమాచారం. తన ప్రాజెక్ట్ కోసం సురేష్ బాబు సహకారాన్ని కోరే ముందు వర్మ పలు అగ్ర నిర్మాణ సంస్థలను కూడా సంప్రదించినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని ఆ వర్గాలు చెబుతున్నాయి.
'రిలయెన్స్ తో డీల్ కుదురకపోవడంతో పాటు ఈ చిత్రానికి సహనిర్మాణ భాగస్వామ్యం వహిస్తామని ముందుకు వచ్చిన అమితాబ్ బచ్చన్ కంపెనీ ఎబి కార్పొరేషన్ కూడా ఇప్పుడు చేతులెత్తోంది' అని ఆర్.జి.వి. కార్యాలయానికి చెందిన ఒకరు తెలిపారు. 'రణ్' చిత్రం కోసం సోనీ పిక్చర్స్ సంస్థ కూడా చర్చలు జరిపిందనీ, అయితే అవి ఫలవంతం కాలేదని కూడా వినిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై వర్మ స్పందిస్తూ...సురేష్ బాబుతో కలిసి పనిచేయబోతున్న మాట నిజమేననీ, చాలాకాలంగా తాము కలిసి పనిచేయాలని కూడా అనుకుంటున్నామనీ చెప్పారు. బిగ్ ఎంటర్ టైన్ మెంట్ తో ఒప్పందం కుదరలేదనే వార్తల్లో కూడా నిజం కాదన్నారు. సురేష్ బాబుతో పనిచేయాలనుకోవడం తన ఛాయెస్ మాత్రమేనని అన్నారు. చాలాకాలంగా తాము ఒకరికొకరు తెలిసి ఉండటం, కలిసి పనిచేయాలనే ఆలోచన ఉండటం, ఇది సరైన ప్రాజెక్ట్ గా భావించడంతో కలిసి ముందుకు వెళ్లనున్నామనీ వర్మ వివరణ ఇచ్చారు. హిందీ చిత్రం 'రణ్ ' కోసం వర్మతో కలిసి పనిచేయబోతున్న విషయం నిజమేనని సురేష్ బాబు సైతం ధ్రువీకరించారు.సినిమా షెడ్యూల్, నటీనటుల ఎంపిక వారం రోజుల్లో పూర్తవుతుందని అన్నారు. ఈ ప్రాజెక్ట్ నుంచి బిక్ ఎంటర్ టైన్ మెంట్, ఎపి కార్పొరేషన్ తప్పుకున్నారంటూ వస్తున్న వదంతుల్లో నిజం లేదనీ, ఆయన (వర్మ) చేతుల్లో చాలా స్క్రిప్టులు ఉన్నందున వాటి కోసం అప్రో చ్ అయి ఉంటారనీ, ఈ సినిమాకు కాదనీ ఆయన అన్నారు.'వర్మ నాకు చాలా కాలంగా తెలుసు. రణ్ స్క్రిప్టు మాకు బాగా నచ్చింది. బాలీవుడ్ సినిమాలు చేయాలనే కోరిక నాకు ఉంది. సరైన చిత్రం కోసమే నిరీక్షిస్తున్నాను' అని సురేష్ బాబు వివరించారు.
News Posted: 18 February, 2009
|