సెలీనాకు సెక్యూరీటీ వేధింపులు
ఢిల్లీ: సెక్యూరిటీ చెకప్ ల సాకుతో విదేశీ ఎయిర్ పోర్ట్ లలో పలువురు బాలీవుడ్ స్టార్స్ చేదు అనుభవాలను చవిచూసిన సంఘటనలు గతంలో ఉన్నాయి. ఇందుకు భిన్నంగా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లోనే తనకు వేధింపులు ఎదురుకావడం నటి సెలీనా జైట్లీకి మింగుడు పడటం లేదు. అక్కడి సెక్యురీటీ గార్డులు తనిఖీల పేరుతో తన లూయిస్ విట్టన్ హ్యాండ్ బ్యాగ్ నూ, ఖరీదైన కాస్మొటిక్స్ ను డ్యామేజ్ చేశారనీ, తన పట్లా, తన సహచర మహిళా ప్రయాణికుల పట్ల చాలా దురుసుగా వ్యవహరించారనీ సెలీనా వాపోతోంది. 'సెక్యురిటీ ఆఫీసర్ల వల్ల జీవితంలో మొదటి సారి నాలో అభద్రతాభావం కలిగింది' అని ఆమె తీవ్ర స్థాయిలో స్పందించింది.
ఢిల్లీలో ఒక కార్యక్రమానికి హాజరై ముంబై తిరుగు ప్రయాణం కోసం ఎయిర్ పోర్ట్ వచ్చినప్పుడు ఈ చేదు అనుభవం ఆమెకు ఎదురైంది, 'సెక్యూరిటీ చెక్ సమయంలో గార్డులు స్కానర్ ద్వారా తన ఎల్.వి. హ్యాండ్ బ్యాగ్ ను చెక్ చేయాల్సి ఉంది. జిప్ ఓపెన్ చేసి అందులోని సామాన్లకు తనిఖీ చేయాల్సి ఉంటుంది. అయితే వాళ్లు చాలా వయెలెంట్ గా బ్యాగ్ ను అటూఇటూ గట్టిగా ఊపుతూ తలక్రిందులు చేసేశారు.
స్కానర్ దగ్గరకు బ్యాగ్ పంపే సమయానికి అందులోని సామాన్లనీ దెబ్బతిన్నాయి. బ్లాక్ బెర్రీ, ఐపాడ్ లతో సహా విలువైన కాస్మొటిక్స్ పాడైపోయాయి' అని సెలీనా వాపోయింది. ఇక్కడితో వ్యవహారం సర్దుమణగలేదు. ఒక 80 ఏళ్ల వృద్ధురాలి పట్ల కూడా గార్డులు అనుచితంగా ప్రవర్తించారనీ, తీహారీ జైలు ఖైదీలతో ప్రవర్తించినట్టుగా దురుసుగా నెట్టడం, వయోవృద్ధురాలిని కూడా కనికరం లేకుండా వ్యవహరించడం తనకు తీవ్ర ఆవేదన కలిగించిందనీ చెప్పింది. సెక్యురిటీ సరిగా ఉండేలా చూసుకోవడం వారి బాధ్యత అనే విషయం తెలుసుననీ, అలాగని బోలెడు డబ్బుపోసి టిక్కెట్లు కొనుక్కున్న పాసింజర్ల పట్ల అనుచితంగా ప్రవర్తించడం కూడా సరికాదని అన్నారు. ఈ సంఘటన విషయమై ఉన్నతాధికారులతో సెలనీ కొద్దిపాటి ఘర్షణకు కూడా దిగింది. 'సారీ చెప్పాం కదా...ఇంకేం చేయాలి' అని వారు సెలీనాను ప్రశ్నించినట్టు తెలిసింది. అధికారులతో సెలీనా వ్యాగ్యుద్దానికి దిగిన అనంతరం చెప్పుకోదగిన పరిణామాలేవీ చోటుచేసుకోలేదు. అయితే ఆ సంఘటన సమయంలో సెలీనా చూపిన చొరవ, ధైర్యం సాటి ప్రయాణికుల అభినందనలను నిశ్చయంగా అందుకునే ఉంటుంది.
News Posted: 18 February, 2009
|