అభిషేక్ గిన్నెస్ రికార్డ్
ముంబైః బిగ్ బి అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ ఇప్పుడు గిన్నెస్ రికార్డుపై కన్నేశారు. అందుకు ఈ శుక్రవారమే ముహూర్తం కూడా. ఆయన నటించిన 'ఢిల్లీ 6' చిత్రం ఇదే రోజు విడుదలవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 12 గంటల్లో ఆరుకు పైగా సిటీల్లో సుడిగాలి వేగంతో తిరిగి పబ్లిక్ అప్పియరెన్స్ తో అంతకుముందున్న రికార్డును ఆయన బద్దలు కొట్టబోతున్నారు. దుబాయ్ లో ఈ చిత్రం 'ప్రీమియర్ షో'కు హాజరైన అభిషేక్ బచ్చన్ ఈ సరికొత్త రికార్డు విషయంలో ఎంతో ఉత్సుకత ప్రదర్శించారు.
'12 గంటల్లో 5 పబ్లిక్ అప్పియెరెన్స్ లతో కొందరు జర్మన్ నటులు వరల్డ్ రికార్డు సృష్టించడం విన్నాను. ఆ రికార్డును నేను బద్దలు కొట్టాలనుకుంటున్నాను. అదే 12 గంటల్లో ఆరు సిటీల్లో కనీసం ఆరు నుంచి ఏడు బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నాను. ఏడు సిటీల్లో పర్యటించే అవకాశాలు కూడా ఉన్నాయి' అని అభిషేక్ తెలిపారు. 'ఢిల్లీ 6' చిత్రం ప్రదర్శితమవుతున్న గురుగావ్, ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, ఫరరీదాబాద్, చండీగఢ్, బరోడా, ముంబై సిటీలను కవర్ చేస్తూ అభిషేక్ పబ్లిక్ ముందుకు వస్తారనీ, 20వ తేదీన కానీ, 21న కానీ గత రికార్డును అభిషేక్ బద్దలు కొడతారనీ విజ్ క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ సుభాష్ జోసఫ్ తెలిపారు. అభిషేక్ ప్రయత్నానికి (గిన్నెస్ రికార్డు) విజ్ క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ వెన్నుదన్నుగా నిలుస్తోంది. ప్రస్తుతం ఉన్న రికార్డును బ్రేక్ చేస్తాననే అనుకుంటున్నాననీ, ఈ ఐడియా తనకెంతో బాగా నచ్చిందనీ, అదీ గాక తన మనసుకు ఎంతో నచ్చిన ఒక సినిమా కావడం కూడా ఈ ప్రయత్నానికి మరో ప్రధాన కారణమనీ అభిషేక్ పేర్కొన్నారు. అభిషేక్ సృష్టించబోయే చరిత్రను దగ్గరుండి పర్యవేక్షించేందుకు గిన్నెస్ అధికారులు కూడా ఈ ఈవెంట్ లో పాల్గొనే అవకాశాలున్నాయి.
News Posted: 19 February, 2009
|